గురువారం, 28 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : గురువారం, 6 అక్టోబరు 2016 (18:38 IST)

అమెరికాకు పాక్ వార్నింగ్: కాశ్మీర్‌పై పట్టించుకోకపోతే.. రష్యా, చైనాతో కలిసీ....

పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కాశ్మీర్ విషయంలో తమ వాదనను అమెరికా అంగీకరించకపోవడంతో బిత్తరపోయిన పాకిస్థాన్‌ రాయబారులు ఏకంగా ఆ దేశానికి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ

భారత్-పాకిస్థాన్‌ల మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది. పాక్ ఆక్రమిత ఉగ్రవాద శిబిరాలపై భారత ఆర్మీ చేపట్టిన దాడులపై ఎలా ప్రతీకారం తీర్చుకోవాలో తెలియక పాకిస్థాన్ మల్లగుల్లాలు పడుతోంది. సర్జికల్ స్ట్రైక్స్ జరగలేదని చెప్తోంది. ఇంకా ఎన్నెన్ని వేషాలు వేయాలో వేస్తోంది. అయితే తాజాగా భారత్ పాకిస్థాన్‌కు షాక్ ఇచ్చే నిర్ణయాలు తీసుకుంటోంది. పఠాన్ కోట్ దాడి సూత్రధారి మసూద్ అజర్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని భారత్ డిమాండ్ చేసింది. 
 
మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించే విషయంలో చైనా తన వీటో అధికారాన్ని పొడిగించి మరీ నిరాకరించిన నేపథ్యంలో ఉగ్రవాది మసూద్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి తీసుకొచ్చే దిశగా భారత్ తన ప్రయత్నాలు మొదలెట్టింది. పాకిస్థాన్‌పై యుద్ధం చేసేందుకు భారత్ సుముఖత చూపలేదని.. ఉగ్రవాదులపైనే భారత్ యుద్ధం చేయాలనుకుంటుందని ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన ఇండియా.. మసూద్‌పై ఐక్యరాజ్య సమితి త్వరగా చర్యలు తీసుకోవాలని, అతడిపై నిషేధం విధించాల్సిందేనని స్పష్టం చేసింది.

లేదంటే ప్రపంచ దేశాలకు తప్పుడు సంకేతాలు వెళ్లే ప్రమాదముందని హెచ్చరించింది. ఇప్పటికే హిజ్బుల్ ఉగ్రవాది బుర్హాన్ వనీని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ కీర్తించిన విషయాన్ని గుర్తు చేసిన భారత్... మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాల్సిందేనని వెల్లడించింది. 
 
అయితే పాకిస్థాన్ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. కాశ్మీర్ విషయంలో తమ వాదనను అమెరికా అంగీకరించకపోవడంతో బిత్తరపోయిన పాకిస్థాన్‌ రాయబారులు ఏకంగా ఆ దేశానికి హెచ్చరికలు జారీచేశారు. అమెరికా ఇక ఎంతమాత్రం ప్రపంచ శక్తి కాదన్నారు. భారత్-కాశ్మీర్ విషయంలో తమ వాదనను పట్టించుకోకపోతే తాము రష్యాకు, చైనాకు దగ్గరవుతామని అమెరికాను పాకిస్థాన్ హెచ్చరికలు జారీ చేసింది.  
 
ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న పాక్‌ ప్రధాని నవాజ్‌ షరీఫ్‌ రాయబారి ముషాహిద్‌ హుస్సేన్‌ సయెద్‌ ఈ హెచ్చరికలు జారీ చేశారు. అమెరికా ప్రపంచ ఆధిపత్యం తగ్గిపోతుందని.. దాని గురించి మరిచిపోదామని పేర్కొన్నారు. కాశ్మీర్‌లో మానవహక్కుల ఉల్లంఘన జరుగుతుందని, ఈ అంశాన్ని అంతర్జాతీయ దృష్టికి తెచ్చేందుకు పాక్‌ ప్రధాని షరీఫ్‌ రాయబారులను నియమించిన సంగతి తెలిసిందే. 
 
ఇందులో భాగంగా తమ వాదనను వినిపించేందుకు అమెరికాకు వెళ్లిన షరీఫ్ రాయబారులకు.. అమెరికా టెర్రరిస్టుల విషయంలో ఘాటు సందేశం ఇచ్చింది. దీంతో ఇరుకునపడిన రాయబారులు నోటికి పనిచెప్పారు. అంతే అమెరికాకు ప్రత్యక్షంగా హెచ్చరికలు జారీచేశారు. రష్యాకు, చైనాకు దగ్గరవుతామని, అమెరికా ఆధిపత్యం తగ్గిపోతుందని వ్యాఖ్యానించారు. పాకిస్థాన్ హెచ్చరికలపై వైట్ హౌస్ ఏవిధంగా స్పందిస్తుందో వేచి చూడాలి.