350 మంది తాలిబన్ తీవ్రవాదుల హతం : కొరకరాని కొయ్యిలా పంజ్‌షిర్ ప్రావిన్స్
ఆప్ఘనిస్థాన్ దేశాన్ని పూర్తిగా కైవసం చేసుకున్న తాలిబన్ తీవ్రవాదులకు పంజ్‌షిర్ ప్రావిన్స్ ప్రాంతం మాత్రం కొరకరాని కొయ్యిలా మారింది. ఈ ప్రాంతంలోకి అడుగుపెట్టాలని భావించే తాలిబన్ తీవ్రవాదులను ఆ ప్రాంత వాసులు హతమార్చుతున్నారు. మంగళవారం ఒక్కరాత్రే ఏకంగా 350 మంది తాలిబన్ తీవ్రవాదులను పంజ్‌షిర్ ప్రాంత వాసులు హతమార్చారు.
ముఖ్యంగా, పంజ్‌షిర్ ప్రావిన్స్‌లోని పలు ప్రాంతాలు.. పర్వాన్ ప్రావిన్స్‌లోని జబల్ సరాజ్ జిల్లా.. బఘ్లాన్ ప్రావిన్స్‌లోని రెండు జిల్లాల్లో తాలిబన్లు, తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు జరిగాయి. ఈ ఘర్షణల్లో మృతులపై ఇప్పటివరకూ స్పష్టత లేకపోయినా.. తాము 350 మంది తాలిబన్లను హతమార్చామని, మరో 40 మందిని బందీలుగా చేసుకున్నామని నార్తర్న్ అలయెన్స్ ప్రకటించింది.
గుల్‌బహార్ నుంచి తమ పంజ్‌షిర్ లోయలోకి అడుగుపెట్టడానికి ప్రయత్నించిన తాలిబన్లపై తిరుగుబాటుదారులు దాడి చేసినట్లు టోలో న్యూస్ కూడా తెలిపింది. 'మిమ్మల్ని లోయలోకి రానిస్తాము కానీ.. మళ్లీ బయటకు వెళ్లనీయం' అంటూ' తాలిబన్లను ఉద్దేశించి నార్తర్న్ అలయెన్స్ ట్వీట్ చేసింది.