ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదం: 71 మంది మృతి
దక్షిణ ఇథియోపియాలో ఘోర రోడ్డు ప్రమాదంలో 71 మంది ప్రాణాలు కోల్పోయారు. వివాహ వేడుకకు వెళ్లి తిరిగి వస్తున్న ఓ బృందం వారు ప్రయాణిస్తున్న ట్రక్కు అదుపు తప్పి నదిలో పడిపోవడంతో విషాదం నెలకొంది. సిడామా ప్రాంతంలోని గెలాన్ బ్రిడ్జిపై ఈ ఘటన జరిగింది.
ట్రక్కు ఒక్కసారిగా అదుపుతప్పి నదిలో పడిపోయింది. నదిలో బలమైన ప్రవాహాలు, సహాయక చర్యల్లో జాప్యం కారణంగా మృతుల సంఖ్య పెరిగింది. మృతుల్లో 68 మంది పురుషులు, ముగ్గురు మహిళలు ఉన్నారని పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన ఐదుగురు వ్యక్తులు వైద్య చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి విషమంగా ఉందని వివరించారు.