బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 4 డిశెంబరు 2024 (09:09 IST)

తెలుగు రాష్ట్ర ప్రజలను భయపెట్టిన భూప్రకంపనలు.. (Video)

earthquake
రెండు తెలుగు రాష్ట్రాల్లో భూప్రకంపనలు ప్రజలను భయపెట్టాయి. విజయవాడ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో భయంతో ప్రజలు ఇళ్ల నుంచి పరుగులు తీశారు. విజయవాడ, జగ్గయ్యపేట, పరిసర గ్రామాల్లో సైతం భూ ప్రకంపనలు కనిపించాయి. దీంతో ప్రజలు గృహాలు, అపార్టుమెంట్ల నుంచి ప్రాణభయంతో పరుగులు తీశారు. 
 
అలాగే, తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా భూకంపం వచ్చింది. కొన్ని చోట్ల స్వల్పంగా భూమికంపించింది. వరంగల్ నగరం సహా అన్ని ప్రాంతాల్లో భూకంపం రావడంతో ప్రజలు భయాందోళనలకు గురయ్యారు. ఏం జరుగుతుందో అర్థంకాక భయంతో గందరగోళానికి గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఇళ్ల నుంచి బయటకు వచ్చారు. 
 
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలోనూ మూడు సెకన్ల పాటు భూమి కంపించింది. బుధవారం ఉదయం 7.27 గంటలకు ఒక్కసారిగా భూకంపం రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారు. అలాగే, మణుగూరు సబ్ డివిజన్ వ్యాప్తంగా ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. ఉదయం 7.28 నిమిషాలకు భూప్రకంపనలు వచ్చాయి. పాలమూరు జిల్లా గంగారంలో భూమి తీవ్రంగా కంపించింది.
 
భూకంపం దెబ్బకు కుర్చీలో కూర్చుని ప్రజలు సైతం కిందపడిపోయారు. దీంతో అంతా తీవ్ర ఆందోళనలకు గురయ్యారు. కరీంనగర్ జిల్లా విద్యానగర్‌లోనూ భూప్రకంపనలు కనిపించాయి. నిలబడినవారు సైతం ఒక్కసారిగా పక్కకు ఒరిగినట్టు స్థానికులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని, సుల్తానాబాద్‌, కరీంనగర్, హుజురాబాద్‌లో సైతం భూమి స్వల్పంగా కంపించింది.