శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 1 మార్చి 2022 (19:09 IST)

ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీకి స్టాండింగ్ ఒవేషన్

రష్యా సైనిక బలగాలకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ అలుపెరగని పోరాటం చేస్తుంది. ఏకంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ యుద్ధభూమిలో దిగి తమ దేశ పౌరులకు, సైనిక బలగాలకు నైతిక స్థైర్యాన్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ సభ్య దేశాలు మంగళవారం అత్యవసరంగా సమావేశమయ్యాయి. ఈ సమావేశానికి సభ్య దేశాలతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ పాల్గొన్నారు. 
 
ఈ సందర్భంగా ఆయన కీలక ప్రసంగం చేశారు. ఆ తర్వాత ఈయూ పార్లమెంట్ ఆయనకు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చింది. రష్యాకు లొంగిపోయే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పైగా, రష్యాకు తమ సత్తా ఏంటో చూపిస్తామని ఆయన పార్లమెంట్ వేదికగా శపథం చేశారు. ఈ పోరాటంలో తప్పకుండా  విజయం సాధిస్తామన్నారు. 
 
అసలు రష్యా అధినేత పుతిన్ లక్ష్యమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ యుద్ధంలో రష్యా వేసిన బాంబు దాడుల్లో ఇప్పటివరకు 16 మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయారన్నారు. కానీ, తమ దేశ పౌరులతో పాటు చిన్నారులు క్షేమంగా జీవించాలన్నదే తమ కోరిక అని జెలెన్ స్కీ స్పష్టం చేశారు. 
 
ఉక్రెయిన్ అధినేత చేసిన ప్రసంగాన్ని ఆద్యంతం ఆసక్తిగా ఆలకించిన ఈయూ సభ్య దేశాల ప్రతినిధులు ప్రసంగం ముగియగానే ఆయనకు లేచి నిలబడి తమ కరతాళ ధ్వనులతో హర్షం వెలిబుచ్చారు. ఆ తర్వాత ఈయూ పార్లమెంట్ అధ్యక్షురాలు మాట్లాడుతూ, ఈయూ దేశాలన్ని ఉక్రెయిన్‌గా అండగా నిలుస్తాయని ప్రకటించారు.