నావికా తుపాకులను భారత్‌కు విక్రయించేందుకు అమెరికా రెడీ
సుమారు 1 బిలియన్ డాలర్లు (7వేల కోట్ల రూపాయలు) విలువచేసే నావికా తుపాకులను భారత్‌కు విక్రయించడానికి నిర్ణయించింది అమెరికా. ఈ మేరకు అగ్రరాజ్య కాంగ్రెస్కు తన నిర్ణయాన్ని నోటిఫికేషన్ ద్వారా వెల్లడించింది డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం. ఈ ఆయుధాల వల్ల భారత నావికాదళం మరింత బలపడనుంది.
శత్రువులకు చెందిన యుద్ధనౌకలు, విమానాలతో పోరాడటానికి ఈ నేవెల్ గన్లను ఉపయోగించవచ్చు. వీటితో దేశ భద్రత మరింత మెరుగుపడుతుంది. ప్రతిపాదిత 13 ఎమ్కే-45 5 ఇంచ్/62 కాలిబర్(ఎమ్ఓడీ 4) నావికా తుపాకులు, సంబంధిత పరికరాల వ్యయం దాదాపు 1.02 బిలియన్ డాలర్లని అగ్రరాజ్య రక్షణ-భద్రతా సహకార సంస్థ తెలిపింది.
ఇప్పటి వరకు ఆస్ట్రేలియా, జపాన్, దక్షిణ కొరియాలకు మాత్రమే ఎమ్ఓడీ 4ను విక్రయించింది అమెరికా. తాజాగా ఈ జాబితాలోకి భారత్ చేరింది. మరిన్ని మిత్ర దేశాలకు ఈ నావికా తుపాకులను అమ్మడానికి సిద్ధపడుతోంది అగ్రరాజ్యం.