సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్

నేడే.. యావత్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు

kamal - trump
యావత్ ప్రపంచం అత్యంత ఉత్కంఠగా ఎదురు చూస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు మంగళవారం జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో అగ్రరాజ్యంలోని 24.4 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. అయితే, ఇప్పటికే ముందస్తు ఓటింగ్ ద్వారా 7.5 కోట్ల మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మిగిలిన వారంతా మంగళవారం జరిగే పోలింగ్ రోజున ఓటు వేయనున్నారు. 
 
ఇకపోతే, ఈ ఎన్నికల్లో అధ్యక్ష పీఠం కోసం పోటీపడుతున్న డొనాల్డ్ ట్రంప్, కమలా హ్యారిస్‌లు ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ముమ్మరంగా ప్రచారం చేశారు. సోమవారం రాత్రితో వారి ప్రచారం ముగిసింది. అయితే, ఇప్పటివరకు నిర్వహించిన సర్వేలను బట్టి ఇరువురి మధ్య హోరాహోరీ పోరు తప్పదని తేలింది.
 
కాగా, అధ్యక్షుడి ఎన్నికకు కీలకంగా భావించే స్వింగ్ స్టేట్స్‌లో ట్రంప్, కమల మధ్య నువ్వా? నేనా? అన్నట్టుగా పోటీ ఉన్నట్టు ఒపీనియన్ పోల్స్‌లో వెల్లడయింది. ఈ రాష్ట్రాల్లో అక్టోబరు 24 నుంచి ఈ నవంబరు 2 వరకు ది న్యూయార్క్ టైమ్స్-సైనా పోల్స్ సర్వే నిర్వహించింది. 
 
ఇందులో విస్కాన్సిన్, నార్త్ కరోలినా, నెవెదాలో కమలకు మద్దతు ఉంటే.. అరిజోనాలో ట్రంపై వైపు ఓట్లరు మొగ్గచూపుతున్నట్లు తెలుస్తోంది. అలాగే పెన్సిల్వేయా, జార్జియా, మిషిగన్ ఇరువురు అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ ఉన్నట్లు సమాచారం.
 
ప్రధాన పోటీ డెమోక్రాట్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్యే ఉన్నా.. వీరితో పాటు కొంతమంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఈసారి ఎన్నికల బరిలో ఉన్నారు. రాబర్ట్ ఎఫ్ కెన్నడీ జూనియర్, కార్నెల్ వేస్ట్‌ల ఇండిపెండెంట్స్‌గా బరిలో ఉంటే.. లిబర్టేరియన్ పార్టీ నుంచి చేజ్ ఓలివర్, గ్రీన్పార్టీ నుంచి జిల్ స్టీన్ పోటీలో ఉన్నారు.