గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. బిబిసి తెలుగు
Written By బిబిసి
Last Modified: సోమవారం, 4 నవంబరు 2024 (13:28 IST)

అమెరికా ఎన్నికలు: కమలా హారిస్, డోనల్డ్ ట్రంప్- ఇద్దరిలో ఎవరు గెలిస్తే భారత్‌కు ప్రయోజనం?

Trump-Kamala Harris
అమెరికాలో అధ్యక్ష ఎన్నికల తుది దశ పోలింగ్ జరుగుతోంది. నాటకీయ పరిణామాలతో నిండిపోయిన ఈ ఎన్నికలు, ప్రపంచంపై తీవ్ర ప్రభావం చూపుతాయని పలువురు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా ఎన్నికల్లో ఒకసారి గెలిచి, తర్వాత ఓడిపోయి ఇప్పుడు మరోసారి బరిలోకి దిగిన డోనల్డ్ ట్రంప్ ఒకవైపు, డెమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తప్పుకోవడంతో అనూహ్యంగా పోటీలోకి వచ్చిన భారత మూలాలున్న కమలా హారిస్ మరోవైపు మోహరించి ఉన్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ఎన్నికల ఫలితాలలో ఎవరు గెలిస్తే భారత్‌కు ఎక్కువ ప్రయోజనం ఉంటుంది? బీబీసీ అందిస్తున్న విశ్లేషణ మీ కోసం..
 
భారత్ వైపు నుంచి చూస్తే ఏ అభ్యర్థి ప్రయోజనం? అమెరికా ఎన్నికలు భారత్‌పై ఎలాంటి ప్రభావం చూపుతాయి? అమెరికాలో నివసిస్తున్న భారతీయులు ఈ ఎన్నికలను ఎలా చూస్తున్నారు? వీటన్నింటిపై చర్చ కోసం ‘కలెక్టివ్ న్యూస్‌రూమ్’ డైరెక్టర్ ఆఫ్ జర్నలిజం ముకేశ్ శర్మతో అమెరికా నుంచి బీబీసీ కరస్పాండెంట్లు దివ్య ఆర్య, తర్హబ్ అస్గర్‌లు చర్చలో పాల్గొన్నారు. బ్రిటన్ నుంచి సీనియర్ జర్నలిస్ట్, అంతర్జాతీయ రాజకీయాలను నిశితంగా గమనించే శివకాంత్ కూడా ఈ చర్చలో భాగమయ్యారు.
 
అమెరికా-భారత్ సంబంధాలపై నిపుణులైన భారత మాజీ దౌత్యవేత్త స్కంద్ తాయల్ కూడా ఈ చర్చలో పాలుపంచుకున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల అభ్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొంది. 50 రాష్ట్రాలలో మొత్తం 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లు ఉన్నాయి. ఒక అభ్యర్థి ప్రెసిడెంట్ కావడానికి మెజారిటీ మార్క్ 270 లేదా అంతకంటే ఎక్కువ ఓట్లు రావాలి. రెండు మినహా అన్ని రాష్ట్రాల్లో ఎక్కువ ఓట్లు పొందిన అభ్యర్థికి ఎలక్టోరల్ కాలేజీ ఓట్లన్నీ ఇస్తారు. గత ఎన్నికల్లో డెమొక్రటిక్ పార్టీకి చెందిన జో బైడెన్ 306 ఎలక్టోరల్ ఓట్లను సాధించగా, రిపబ్లికన్ పార్టీకి చెందిన డోనల్డ్ ట్రంప్ 232 ఓట్లు పొందారు.
 
ఈ ఎన్నికలు ఎందుకు ముఖ్యం?
అమెరికా ఎన్నికల ఫలితాలు భారత్‌తో సహా మొత్తం ప్రపంచంపై ప్రభావం చూపుతుంటాయి. ప్రపంచంలోని చాలా అంశాలు అమెరికా వైఖరిపై ఆధారపడి ఉంటాయి. "అమెరికా ప్రస్తుతం అంత శక్తిమంతం కాకపోవచ్చు. కానీ, దాని ఆధిపత్యం ఇప్పటికీ అన్ని అంతర్జాతీయ సంస్థల మీదా ఉంది" అని సీనియర్ జర్నలిస్ట్ శివకాంత్ అన్నారు. "ఐక్యరాజ్యసమితిలో సంస్కరణలు తీసుకురావడానికి భారత్ చాలాకాలంగా ప్రయత్నిస్తోంది. అప్పుడే భారత్ వంటి పెద్ద దేశాలు చెప్పేవి వినగలరు. సరైన ప్రాతినిధ్యమూ దక్కుతుంది. అయితే దానికి అమెరికా కూడా ఒప్పుకోవాలి" అని అన్నారు.
 
ఒకవేళ అమెరికా అంగీకరించినా కొన్ని ఇబ్బందులు ఉంటాయని శివకాంత్ చెప్పారు. అంతర్జాతీయ సంస్థల నిర్వహణకు అమెరికా ఇప్పటికీ అతిపెద్ద దాతగా ఉంది. అమెరికాలో ఏ నిర్ణయం తీసుకున్నా అది భారత్‌లోనే కాకుండా యావత్ ప్రపంచ రాజకీయాలపై ప్రభావం చూపుతుందని శివకాంత్ అన్నారు. అది వాణిజ్యమైనా, దౌత్యపరమైన విషయాలైనా, పర్యావరణ సమస్యలైనా, వాతావరణ మార్పులైనా, ఉగ్రవాదమైనా అమెరికా ప్రభావం ఉండి తీరుతుందంటారు శివకాంత్. "అమెరికా ప్రజలు తీసుకునే నిర్ణయాలు మిగతా ప్రజల జీవితాలపై చాలా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అమెరికాలో జరిగే ఎన్నికలపై దృష్టి సారిస్తారు. భారత్ కూడా దాని గురించి ఆలోచించాల్సి ఉంటుంది." అని ఆయన అభిప్రాయపడ్డారు.
 
ఎవరు గెలిస్తే భారత్‌కు ప్రయోజనం?
అమెరికా అధ్యక్షుడిగా ఎవరున్నా భారత్, అమెరికాల మధ్య సంబంధాలు స్థిరంగానే ఉంటాయని మాజీ దౌత్యవేత్త స్కంద్ తాయల్ అభిప్రాయపడ్డారు. "మీరు భారత ప్రభుత్వ దృక్కోణం నుంచి చూస్తే.. భారత్, అమెరికా సంబంధాలలో రెండు మూడు కీలక అంశాలున్నాయి. చైనాకు రష్యా దగ్గరవడానికి ప్రస్తుత యు.ఎస్ విదేశాంగ విధానం కారణమని ప్రభుత్వానికి వెలుపల ఉన్న మాలాంటి వ్యక్తులం భావిస్తున్నాం. ట్రంప్ తిరిగి వచ్చినట్లయితే ఇది మారొచ్చని చాలామంది అనుకుంటున్నారు’’ అని అన్నారు.
 
తాయల్ ప్రకారం.. భారతదేశం రష్యాకు బలమైన మద్దతుదారు. ప్రస్తుత బైడెన్ ప్రభుత్వం దాన్ని ఇష్టపడటం లేదు. ఇది కాకుండా, అమెరికా, భారత్ సహా ప్రపంచం ఎదుర్కొంటున్న అతిపెద్ద సవాలు చైనా. దీంతో ట్రంప్, బైడెన్ విధానాలు చైనా పట్ల కఠినంగానే ఉన్నాయి. కమలా హారిస్ అధ్యక్షురాలైతే బైడెన్ అమలు చేస్తున్న ప్రస్తుత విదేశాంగ విధానం కొనసాగవచ్చని ప్రజలు విశ్వసిస్తున్నారు. పాలసీ పరంగా చూస్తే భారత్‌తో రిపబ్లికన్ ప్రభుత్వం వైఖరి మెరుగ్గానే ఉండేదని శివకాంత్ అభిప్రాయపడ్డారు.
 
"రిపబ్లికన్ ప్రభుత్వంలో పెద్ద ఒప్పందాలు జరిగాయి. అయితే ఈసారి ప్రధాని మోదీ, డోనల్డ్ ట్రంప్‌ సంబంధాలు మారిపోయాయి" అని అన్నారు. "ట్రంప్ వాణిజ్య విధానం చాలా రక్షణాత్మకమైనది. ఆ అంచనాలను అందుకోవడం భారత్‌కు కష్టం కావచ్చు." అని శివకాంత్ అన్నారు. "భారత్ ఇప్పుడు తన వస్తువులను వీలైనంత త్వరగా విదేశాలకు విక్రయించాలి. అప్పుడే దేశం పురోగమిస్తుంది. ట్రంప్ ప్రభుత్వం వస్తే అది పెద్ద అడ్డంకి కావొచ్చు." అని అన్నారు. వలస విధానంలో ట్రంప్ కఠినంగా ఉంటారని, అది కూడా భారత ప్రయోజనాలకు ఇబ్బందిగా మారుతుందని శివకాంత్ అభిప్రాయపడ్డారు.
 
శివకాంత్ ప్రకారం.. ఇతర దేశాలు భయపడే నాయకుడిగా ట్రంప్ తనను తాను చూపించుకుంటారు. కానీ, అనిశ్చిత వైఖరితో ఉండే ట్రంప్‌ను ఎక్కువగా నమ్మలేం. మీరు ఆయనతో చేసుకునే ఏ ఒప్పందాన్ని, ఏ విధానాన్ని గట్టిగా నమ్మలేరు. ఇక కమలా హారిస్ గురించి చెప్పాలంటే... మానవ హక్కులు, మత స్వేచ్ఛ, నైతిక విషయాలపై ఆమె విధానాలు చాలా కఠినంగా ఉంటాయి. "భారత ప్రభుత్వానికి, వాణిజ్యానికి ఇద్దరితో కొన్ని ప్రయోజనాలు, మరికొన్ని సవాళ్లు ఉన్నాయి" అని శివకాంత్ అన్నారు.
 
కాగా, ఎవరు అధ్యక్షులైనా చైనా పట్ల అమెరికా అనుసరిస్తున్న విధానంలో పెద్దగా మార్పు వచ్చే అవకాశం లేదని తాయల్ అభిప్రాయపడ్డారు. అయితే, ట్రంప్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటారని, ఒకవేళ చైనాతో ఒప్పందం చేసుకుంటే ఇతర దేశాల ప్రయోజనాలను పట్టించుకోరని అన్నారు. అదే సమయంలో అమెరికా ఎన్నికల ఫలితాలు మిడిల్ ఈస్ట్‌పై కూడా ప్రభావం చూపవచ్చని అన్నారు విశ్లేషకులు. హారిస్ గెలిస్తే ప్రస్తుత విధానాలు కొనసాగవచ్చని అభిప్రాయపడ్డారు. ట్రంప్ గెలిస్తే మారవచ్చని తెలిపారు.
 
అక్కడి భారతీయులు ఏమనుకుంటున్నారు?
భారతీయులకు అమెరికా ఎన్నికల్లో వలసలు, వీసా విధానం ప్రధాన సమస్యలు. అమెరికా ఎన్నికల నేపథ్యంలో అక్కడి భారతీయులు కొందరితో బీబీసీ ప్రతినిధి దివ్య ఆర్య మాట్లాడారు. కమలా హారిస్ భారతీయ మూలం అక్కడి ఇండియన్ అమెరికన్ ఓటర్లకు ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరుస్తోందని దివ్య గమనించారు. ‘’అనేక చిన్న పార్టీలు, సంస్థలు డెమొక్రటిక్ పార్టీతో చేతులు కలిపి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నాయి’’ అని దివ్య చెప్పారు.
 
‘’అయితే, ప్రధాని మోదీతో డోనల్డ్ ట్రంప్‌కు ఉన్న సంబంధాలకు కూడా ప్రాముఖ్యత ఉంది. ట్రంప్ హయాంలో టెక్సస్‌లో జరిగిన 'హౌడీ మోదీ' సభ ప్రజలకు ఇప్పటికీ గుర్తుంది" అని ఆమె అన్నారు. అమెరికాలో భారతీయ సంతతికి చెందిన రెండు ప్రధాన గ్రూపుల వారున్నారని దివ్య అన్నారు. తాత్కాలిక హెచ్-1బీ వీసాలున్నవారు , అమెరికా పౌరసత్వం పొందిన వారు అన్నవి ఈ రెండు వర్గాలు. ఈ ఎన్నికల్లో పౌరులు మాత్రమే ఓటు వేయగలరు. అయితే అమెరికాలో నివసిస్తూ 20-30 సంవత్సరాలుగా గ్రీన్ కార్డ్ కోసం వేచి ఉన్న, తాత్కాలిక వీసా హోల్డర్‌లు చాలామందే ఉన్నారు.
 
"వీరు ఎన్నికలను ఓ కంట గమనిస్తున్నారు. అయితే వారు ఓటు వేయలేరు. ఓటేసినా, వేయకున్నా వారికి ప్రధాన సమస్య ఇమ్మిగ్రేషన్ మాత్రమే" అని దివ్య అన్నారు. వలసలపై ట్రంప్ పాలసీ కూడా పెద్ద సమస్యగా మారింది. బైడెన్ ప్రభుత్వం అక్రమ వలసలను ఆపలేకపోయిందని ట్రంప్ విమర్శించారు. అమెరికాకు వస్తున్న భారతీయుల్లో ఎక్కువమంది విద్యావంతులే. అయితే, ఇటీవలి సంవత్సరాలలో చట్టపరమైన మార్గం చాలా కష్టంగా ఉన్నందున అక్రమ వలసలు కూడా పెరిగాయి.
 
అమెరికాకు వచ్చే భారత్, పాకిస్తాన్, ఇతర దక్షిణాసియా దేశాల ప్రజలకు ఇమ్మిగ్రేషన్ ఆందోళన కలిగిస్తోందని, డోనల్డ్ ట్రంప్ వస్తే ఇమ్మిగ్రేషన్ విధానం కఠినతరం అవుతుందని బీబీసీ ప్రతినిధి తర్హబ్ అస్గర్ అభిప్రాయపడ్డారు.