అక్కడా పాయె... పెన్సిల్వేనియాలోనూ చుక్కెదురు...
అమెరికా ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు మరోమారు చుక్కెదురైంది. గత నెలలో జరిగిన ఆ దేశ అధ్యక్ష ఎన్నికల్లో ఆయన డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికలు జరిగి నెల రోజులు గడిచిపోయాయి. అయినప్పటికీ ట్రంప్ మాత్రం ఓటమిని అంగీకరించడం లేదు. పైగా, ప్రతి రాష్ట్రంలోనూ న్యాయపోరాటానికి దిగారు. ఈ పోరాటంలో పలుమార్లు ఎదురు దెబ్బలు తిన్నారు. అయినప్పటికీ ఆయన వెనక్కి తగ్గడం లేదు. ఈ క్రమంలో పెన్సిల్వేనియా ఎన్నికల ఫలితాలపై ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అక్కడ కూడా ఎదురుదెబ్బే తగిలింది. గతంలో కింది కోర్టు ఇచ్చిన తీర్పునే సుప్రీంకోర్టు కూడా ఇచ్చింది. దీంతో పెన్సిల్వేనియాలోనూ ట్రంప్ ఓడిపోయినట్టు తేలిపోయింది.
పెన్సిల్వేనియాలో జరిగిన ఓటింగ్ సర్టిఫికేషన్‌లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, సుప్రీంకోర్టును ఆశ్రయించిన ట్రంప్ టీమ్‌కు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. పెన్సిల్వేనియా ఎన్నికల్లో ఎటువంటి అక్రమాలూ జరగలేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. మొత్తం 9 మంది న్యాయమూర్తులున్న బెంచ్ ఈ కేసును విచారించింది. ఇందులో ట్రంప్ నియమించిన ముగ్గురు న్యాయమూర్తులు కూడా ఉండటం గమనార్హం. వారు కూడా ఎన్నికల్లో అక్రమాలు జరిగాయనడానికి ఆధారాలు ఉన్నట్టు పేర్కొనలేదు.
కాగా, నవంబర్ 3న ఎన్నికలు జరుగగా, డెమోక్రాట్ల తరపున బరిలో నిలిచిన జో బైడెన్, దాదాపు 70 లక్షల ఓట్లను అధికంగా సాధించి విజయం సాధించారని ఎన్నికల అధికారులు స్పష్టం చేస్తుండగా, ట్రంప్ మాత్రం అంగీకరించడం లేదు. పలు రాష్ట్రాల్లోని కోర్టుల్లో ట్రంప్ టీమ్ డజన్ల కొద్దీ పిటిషన్లను దాఖలు చేసింది.
డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య గట్టి పోటీ కొనసాగిన పెన్సిల్వేనియాలో మెయిల్ ద్వారా వచ్చిన బ్యాలెట్ల చెల్లుబాటును ట్రంప్ టీమ్ సభ్యుడు మైక్ కెల్లీ సవాల్ చేయగా, తొలుత పెన్సిల్వేనియా రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం కేసును కొట్టివేసింది. ఆపై సుప్రీంకోర్టును ట్రంప్ టీమ్ ఆశ్రయించగా, తాజా తీర్పు కూడా ట్రంప్‌కు వ్యతిరేకంగానే రావడం గమనార్హం.