శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. కరోనా
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 డిశెంబరు 2020 (09:15 IST)

కోవిడ్ కేంద్రాల్లో 'సమాజ సేవ' ఉత్తర్వులపై సుప్రీంకోర్టు స్టే!

కరోనా వైరస్ వ్యాప్తి నిరోధకానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక రకాలైన చర్యలు చేపడుతున్నాయి. ఇందులోభాగంగా, ముఖానికి మాస్క్‌ను తప్పనిసరిగా ధరించాలని పదేపదే విజ్ఞప్తి చేస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ముఖానికి మాస్క్ ధరించడం నిర్బంధం కూడా చేశాయి. కానీ, ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల నిర్బంధ అమలు ఉన్న రాష్ట్రాల్లో కూడా అనేక మంది ముఖానికి మాస్కులు ధరించడం లేదు. దీనిపై గుజరాత్ హైకోర్టు ఆగ్రహంతో పాటు అసహనం వ్యక్తం చేసింది. పైగా, మాస్క్‌ ధరించకుండా బహిరంగప్రదేశాల్లో తిరుగుతూ పట్టుబడే వారు కరోనా కేంద్రంలో పనిచేయాలని హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది. 
 
విశాల్‌ అవతాపి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన గుజరాత్‌ హైకోర్టు.. మాస్క్‌ లేకుండా తిరుగుతూ పట్టుబడిన వారు కరోనా కేంద్రాల్లో సేవ చేసేలా చూడాలని ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని బుధవారం ఆదేశించింది. కరోనా నిబంధనలు ఉల్లంఘించిన వారు కరోనా కేంద్రాల్లో 4 నుంచి 5 గంటలపాటు సుమారు ఐదు నుంచి 15 రోజుల వరకు వైద్యేతర విధులు నిర్వహించాలని సూచించింది. 
 
ముఖ్యంగా, క్లీనింగ్‌, హౌ‌స్‌కీపింగ్‌, కుకింగ్‌, హెల్పింగ్‌, సర్వింగ్‌, రికార్డుల తయారీ, రికార్డులను భద్రపర్చడం వంటి పనులను వారితో చేయించాలన్నది. జరిమానా విధించడంతోపాటు వ్యక్తుల వయసు, విద్యార్హత, జండర్‌, హోదా ప్రకారం ఆయా సేవలు అప్పగించాలని సూచించింది. పెద్ద ఎత్తున ప్రజలు గుమిగూడుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం పట్ల హైకోర్టు అసహనం వ్యక్తంచేసింది. 
 
రాష్ట్ర ప్రభుత్వం దీనిపై ఒక విధానాన్ని రూపొందించి ఈ నెల 24న నివేదిక సమర్పించాలని ఆదేశించింది. గుజరాత్ హైకోర్టు జారీచేసిన ఉత్తర్వులపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన కోర్టు... గుజరాత్ హైకోర్టు విధించిన ఉత్తర్వులపై స్టే విధించింది.