గురువారం, 4 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 4 మే 2023 (17:37 IST)

ఉలిక్కిపడిన రష్యా... బంకర్‌లోకి పుతిన్‌

putin
రష్యా అధ్యక్ష భవనం క్రెమ్లిన్‌పై రెండు డ్రోన్లు దాడికి యత్నించడంతో అధ్యక్షుడి భద్రతా సిబ్బంది మరింత అప్రమత్తమైంది. దాంతో పుతిన్‌ను బంకర్‌లోకి తరలించారు. ఆయనకు చెందిన నోవో-ఒగరెవో ప్రాంతంలోని నివాసంలో ఈ బంకర్‌ను నిర్మించారు. అధ్యక్షుడు అక్కడి నుంచే కార్యకలాపాలు నిర్వహిస్తారని స్థానిక మీడియా వెల్లడించింది. 
 
దీనిపై రష్యా అగ్రదేశం అమెరికాను తీవ్రంగా విమర్శించింది. క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రీ పెస్కోవ్‌ తీవ్ర ఆరోపణలు చేశారు. 'ఎక్కడెక్కడ దాడి చేయాలో ఆ లక్ష్యాలను అమెరికా ఎంపిక చేస్తుంది. వాటిని ఉక్రెయిన్ అమలు చేస్తోంది. ఆ యత్నాల గురించి రష్యాకు తెలుసని వాష్టింగన్ తెలుసుకోవాలి. వీటన్నింటికీ ప్రతీకారం తీర్చుకునే హక్కు రష్యాకు ఉంది. రష్యా దగ్గర చాలా ఆప్షన్లు ఉన్నాయి. ప్రస్తుత దాడిపై తక్షణ విచారణ జరుగుతోంది' అని అమెరికాకు పెస్కోవ్‌ హెచ్చరికలు చేశారు. 
 
ఇదిలావుంటే, ఉక్రెయిన్‌లోని చిన్నారులను రష్యా అపహరించుకుపోయిందన్న ఆరోపణలపై కొద్దినెలల క్రితం పుతిన్‌కు అంతర్జాతీయ న్యాయస్థానం అరెస్టు వారెంట్‌ జారీ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ న్యాయస్థానాన్ని జెలెన్‌స్కీ సందర్శించడం గమనార్హం.