శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By
Last Updated : గురువారం, 11 ఏప్రియల్ 2019 (17:05 IST)

హమ్మయ్య.. ఎట్టకేలకు వికీలీక్స్ అధినేత అరెస్టు

ఎట్టకేలకు వికీలీక్స్ అధినేత జూలియన్ అసాంజేను అరెస్టు చేశారు. ఆయన్ను లండన్‌ పోలీసులు అరెస్టు చేశారు. కొన్నేళ్ళ క్రితం వికీలీక్స్ పేరిట దేశాధినేతల గుండెల్లో రైళ్లు పరుగెత్తించిన విషయం తెల్సిందే. 
 
వివిధ దేశాల మధ్య జరిగిన అనేక కీలక ఒప్పందాలతో పాటు.. దేశ రహస్యాలను వికీలీక్స్ సంస్థ ద్వారా అసాంజే లీక్ చేశాడు. దాంతో అనేక దేశాలు ఆయనపై ఇప్పటికీ గుర్రుగా ఉన్నాయి. ఈ క్రమంలో ఆయనపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఈకేసులో ఆయన్ను అరెస్టు చేసేందుకు స్వీడన్ పోలీసులు తీవ్రంగా ప్రయత్నించారు. కానీ, ఆయన పోలీసులకు చిక్కకుండా లండన్‌లోని ఈక్వెడార్ దౌత్యకార్యాలయంలో ఆశ్రయం పొందుతూ వచ్చాడు. 
 
ఈ నేపథ్యంలో అసాంజే ఓ శరణార్థిలా కాకుండా ఇష్టంవచ్చిన రీతిలో వ్యవహరిస్తూ అంతర్జాతీయ ఒడంబడికలకు తూట్లు పొడిచేలా వ్యవహరించసాగాడు. ఆయన చర్యల పట్ల ఈక్వెడార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో ఆయనకు కల్పిస్తూ వచ్చిన ఆశ్రయాన్ని ఈక్వెడార్ దౌత్యకార్యాలయం ఉపసంహరించుకుంది. 
 
ఫలితంగా ఆయన్ను బ్రిటన్ పోలీసులు ఈక్వెడార్ దౌత్య కార్యాలయంలో ప్రవేశించి అసాంజేను అదుపులోకి తీసుకున్నారు. యూకేలో అతడిపై న్యాయవిచారణ జరుగుతుందని బ్రిటన్ వర్గాలు తెలిపాయి. అసాంజేపై అగ్రరాజ్యం అమెరికా కూడా గుర్రుగా ఉన్న విషయం తెల్సిందే.