ఫేస్ బుక్‌లో ఉద్యోగ ప్రకటన... వెళ్తే వెడ్డింగ్ బెల్స్ మోగించి కట్టేశాడు...
సోషల్ మీడియాను మంచి పనుల కోసం ఉపయోగించే వారికన్నా చెడు పనులకే వినియోగించేవారు ఎక్కువైపోతున్నారు. ఫేసుబుక్‌లో ప్రకటన ఇచ్చి కొత్త రకమైన మోసానికి తెరలేపారు మోసగాళ్లు. 21 ఏళ్ల యువతికి ఉద్యోగం ఆశ చూపి, పరిచయంలేని వ్యక్తితో పెళ్లి జరిపించారు. హాంకాంగ్‌లో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చినీయాంశమైంది.
హాంకాంగ్‌కు చెందిన ఓ యువతి ఫేస్‌బుక్‌లో ‘మేకప్ ఆర్టిస్ట్ అప్రెంటీస్‌షిప్ అవకాశం’ అని ఓ ఉద్యోగ ప్రకటన చూసింది. వెంటనే ఆ ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. ఉద్యోగం కోసం ఎంతో ఆశగా వెళ్లిన ఆమెకు అక్కడ నిరాశే మిగిలింది. ఆ కంపెనీలో ఉన్నది వెడ్డింగ్ ప్లానర్ జాబ్ అని తెలుసుకుని నిరాశ చెందింది. అయితే ఆ కంపెనీ ఆమెకు డబ్బు ఆశ చూపి వెడ్డింగ్ ప్లానర్ జాబ్‌లో చేరేలా ఒప్పించారు. ఒక వారంపాటు ఉచిత శిక్షణ ఉంటుందని నమ్మించి, ఇందులో భాగంగా ఒక మాక్ – పెళ్లిలో పాల్గొనాల్సి ఉంటుందని ఆమెతో చెప్పారు.
చైనాలోని ఫ్యుజియాన్‌లో ఈ పెళ్లి జరుగుతుందని, ఇది పూర్తయితే కోర్సు పూర్తయినట్లేనని ఆ సంస్థ ఉద్యోగులు ఆ యువతికి తెలిపారు. అయితే అక్కడ జరుగుతున్న మోసాన్ని గ్రహించలేని ఆ యువతి అందుకు అంగీకరించింది. దీంతో ఆ యువతికి చైనాకు చెందిన ఒక వ్యక్తితో పెళ్లి జరిపించేలా ప్లాన్ చేశారు. ఇదంతా ఉత్తుత్తి పెళ్లి అని భావించిన ఆమె జులైలో ఓ ప్రభుత్వ కార్యాలయంలో వివాహ అంగీకార పత్రాలపై సంతకాలు చేసింది.
చైనా నుంచి హాంకాంగ్ వెళ్లిన తర్వాత గానీ ఆమెకు ఇది నిజమైన పెళ్లి అనే విషయం తెలియలేదు. దీంతో ఆమె న్యాయం కోసం కోర్టును ఆశ్రయించింది. అయితే తనని మోసం చేశారని నిరూపించే ఎలాంటి ఆధారాలు ఆమె దగ్గర లేకపోవడంతో స్థానిక పోలీసులు కూడా ఏమీ చేయలేకపోయారు. దీంతో ఆమె హాంకాంగ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్‌ను ఆశ్రయించింది. ఇక్కడి వారిని పెళ్లిచేసుకుంటే చైనీయులకు హాంకాంగ్‌లో ఉండేందుకు దరఖాస్తు చేసుకునే అవకాశం లభిస్తుంది. అందుకే ఇక్కడ ఇలాంటి మోసాలు ఎక్కువగా జరుగుతుంటాయి. ఇలాంటి మోసాలకి సంబంధించి హాంగాల్‌లో ప్రతి సంవత్సరం 1000కి పైగా కేసులు నమోదు అవ్వడం విశేషం.