శుక్రవారం, 8 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 జూన్ 2021 (08:32 IST)

అపుడు భారత్ అనే దేశమే లేదు.. యోగా పుట్టింది మా దేశంలోనే : నేపాల్ ప్రధాని

నేపాల్ ప్రధానమంత్రి కేపీ శర్మ ఓలీ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జూన్ 21వ తేదీ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని తన అధికారిక నివాసంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఓలి మాట్లాడుతూ.. యోగా నేపాల్‌లోనే పుట్టిందన్నారు. 
 
నిజానికి ఈ ప్రపంచానికి యోగా పరిచయమైనపుడు భారత్ అనే దేశమే లేదంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యోగాను తమ ఋషులే కనుగొన్నారని, అయితే వారి గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పలేకపోయామని ఆవేదన వ్యక్తం చేశారు.
 
అదేసమయంలో ఈ విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోడీ సఫలమయ్యారన్నారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా గుర్తించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వ ప్రతినిధి సభలో మోడీప్రతిపాదించడంతో దానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందన్నారు. 
 
కాగా, నేపాల్ ప్రధానికి వివాదేలేమీ కొత్త కాదు. గతంలో శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యపైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అలాగే, ప్రధాని నరేంద్ర మోడీ కృషి ఫలితంగా 2014 నుంచి జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా జరుపుకుంటున్న విషయం తెల్సిందే.