మంగళవారం, 28 జనవరి 2025
  1. క్రీడలు
  2. క్రికెట్
  3. ఐపీఎల్ వార్తలు
Written By Raju
Last Modified: హైదరాబాద్ , శనివారం, 20 మే 2017 (03:07 IST)

ఐపీఎల్‌10 సీజన్‌లో చరిత్ర పునరావృతం.. తలవంచిన నైట్ రైడర్స్, ఫైనల్లో ముంబై ఇండియన్స్

ఐపీఎల్‌లో చరిత్ర పునరావృతమైంది. భారత-పాకిస్తాన్ మధ్య ప్రపంచ స్థాయి టోర్నీల్లో విజయం ఎల్లవేళలా భారత్‌కే దక్కుతున్న చందంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోటీలో విజయం షరామామూలుగా ముంబై ఇండియన్స్‌కే దక్కింది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు మ్యాచ

ఐపీఎల్‌లో చరిత్ర పునరావృతమైంది. భారత-పాకిస్తాన్ మధ్య ప్రపంచ స్థాయి టోర్నీల్లో విజయం ఎల్లవేళలా భారత్‌కే దక్కుతున్న చందంగా ముంబై ఇండియన్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య పోటీలో విజయం షరామామూలుగా ముంబై ఇండియన్స్‌కే దక్కింది. గత రెండేళ్లుగా వరుసగా ఆరు మ్యాచ్‌ల్లో కోల్‌కతాపై ముంబై ఇండియన్స్‌కు ఓటమి లేకపోవడం విశేషం. ఈ సీజన్‌లో ముచ్చటగా మూడోసారి కేకేఆర్‌పై నెగ్గిన ముంబై ఐపీఎల్‌–10 ఫైనల్లో అడుగుపెట్టింది. కరణ్‌ శర్మ మాయాజాలం... బుమ్రా కట్టుదిట్టమైన బంతులకు విలవిల్లాడిన గంభీర్‌ సేన కేవలం 107 పరుగులకే కుప్పకూలింది. అయితే ఈ సునాయాస లక్ష్యాన్ని కాస్త తడబడుతూనే ముంబై ఛేదించగలిగింది.
 
ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ నాలుగోసారి ఫైనల్లోకి అడుగు పెట్టింది. బౌలర్లు రాజ్యమేలిన ఈ తక్కువ స్కోరింగ్‌ మ్యాచ్‌లో కృనాల్‌ పాండ్యా (30 బంతుల్లో 45 నాటౌట్‌; 8 ఫోర్లు), కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (24 బంతుల్లో 26; 1 ఫోర్, 1 సిక్స్‌) నిలకడైన బ్యాటింగ్‌తో జట్టును ఆదుకున్నారు. ఫలితంగా చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో శుక్రవారం జరిగిన క్వాలిఫయర్‌–2 మ్యాచ్‌లో ముంబై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 18.5 ఓవర్లలో 107 పరుగులకు ఆలౌట్‌ అయ్యింది. సూర్యకుమార్‌ యాదవ్‌ (25 బంతుల్లో 31; 2 ఫోర్లు, 1 సిక్స్‌), ఇషాంక్‌ జగ్గి (31 బంతుల్లో 28; 3 ఫోర్లు) మాత్రమే కాస్త పోరాడగలిగారు. కరణ్‌ శర్మ నాలుగు, బుమ్రా మూడు, జాన్సన్‌ రెండు వికెట్లు తీశారు. అనంతరం స్వల్ప లక్ష్యం కోసం బరిలోకి దిగిన ముంబై 14.3 ఓవర్లలో నాలుగు వికెట్లకు 111 పరుగులు చేసి నెగ్గింది. పీయూష్‌ చావ్లాకు రెండు వికెట్లు దక్కాయి. కరణ్‌ శర్మకు మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు దక్కింది.