గురువారం, 26 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : సోమవారం, 2 డిశెంబరు 2019 (09:37 IST)

ప్రైవేట్ టెలికాం కంపెనీల చార్జీల బాదుడు.. 50 శాతం పెరుగుదల...

దేశంలోని ప్రైవేట్ టెలికాం కంపెనీల చార్జీల బాదుడు మొదలైంది. ఈ కంపెనీలన్నీ ఐదేళ్ళ తర్వాత చార్జీలను పెంచాయి. దీంతో మొబైల్ వినియోగదారులపై పెనుభారంపడనుంది. ఈ చార్జీల పెంపు దాదాపు 50 శాతం మేరకు ఉంది. 
 
దేశ వ్యాప్తంగా ప్రీపెయిడ్‌ మొబైల్‌ కాల్స్‌, డేటా ప్లాన్ల ధరలను పెంచుతున్నట్టు ఆదివారం ప్రైవేటు రంగ టెలికాం దిగ్గజాలైన భారతీ ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియోలు ప్రకటించాయి. ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ ఐడియాలు పెంచిన రేట్లు ఈ నెల 3వ తేదీ నుంచి జియో పెంచే రేట్లు 6 నుంచి అమల్లోకి రానున్నాయి. 
 
నష్టాలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని తగ్గించుకునేందుకు చార్జీల పెంపు నిర్ణయాన్ని కంపెనీలు తీసుకున్నాయి. ఇక ఎయిర్‌టెల్‌, వొడాఫోన్‌ కస్టమర్లు నెల రోజుల పాటు నెట్‌వర్క్‌ సేవలను పొందాలంటే కనీసంగా రూ.49 చెల్లించాల్సి ఉంటుంది. 
 
ఎయిర్ టెల్ పెంచిన చార్జీల మేరకు.. పెంచిన రేట్ల శ్రేణి రోజుకు 50 పైసల నుంచి రూ.2.85 వరకు ఉంది. ఏడాది కాలపరిమితి కలిగిన ఎంట్రీ లెవల్‌ అపరిమిత ప్లాన్‌ ధరను రూ.998 నుంచి రూ.1,499కి పెంచింది. పెంపు 50 శాతం వరకు ఉంది.
 
ఇదే కేటగిరీలో 365 రోజుల కాలపరిమితి రోజుకు 1.5 జీబీ డేటా, అపరిమిత కాల్స్‌ను అందించే ప్లాన్‌ ధరను రూ.1,699 నుంచి రూ.2,398కి పెంచారు. పెంపు 41.2 శాతంగా ఉంది. అపరిమిత కేటగిరీలో 84 రోజుల కాలపరిమితి ఉండే ప్లాన్‌ ధరను రూ.458 నుంచి రూ.598కి పెంచారు.
 
28 రోజుల కాలపరిమితితో రోజుకు 1.5 జీబీ డేటాను అందిస్తున్న ప్లాన్‌ ధరను రూ.199 నుంచి రూ.248 పెంచారు. పెంపు చాలా తక్కువగా ఉందని కంపెనీ వర్గాలు అంటున్నాయి. వారంలో కప్పు టీ కోసం ఒక కస్టమర్‌ వెచ్చించే స్థాయిలో ధరల పెంపు ఉన్నట్టు చెబుతున్నారు.
 
ఎయిర్‌టెల్‌ కూడా నిర్దేశిత పరిమితి దాటిన తర్వాత ఇతర నెట్‌వర్క్‌లకు మాట్లాడే కాల్స్‌పై చార్జీలను వసూలు చేయనుంది. 28 రోజుల వాలిడిటీ ఉండే ప్లాన్లపై 1,000 నిమిషాలు, 84 రోజుల ప్లాన్‌పై 3,000 నిమిషాలు, 365 రోజుల ప్లాన్‌పై 12,000 నిమిషాల పరిమితి ఉంటుంది. ఆ తర్వాత కాల్‌ చార్జీలుంటాయి.