సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By ఠాగూర్

మొబైల్ వినియోగదారుల మరో షాక్... ఏంటది?

డిసెంబర్ నుంచి ప్రముఖ టెలికాం సంస్థలు ఎయిర్‌టెల్, వొడాఫోన్‌లు తమ టారిఫ్ రేట్లను పెంచనున్నట్లు ప్రకటించాయి. తాజాగా జియో కూడా టారిఫ్ రేట్లను పెంచాలని అనుకుంటోంది. ధరల పెరుగుదల అవసరమని భావిస్తే తాము కూడా రేట్లు పెంచుతామని జియో తెలిపింది. కేంద్ర ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలని మూడు నెలల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు ఆదేశాలివ్వడంతో టెలికాం సంస్థలు రేట్లను పెంచేందుకు సిద్ధమయ్యాయి.
 
డెక్కన్ హెరాల్డ్ నుంచి వచ్చిన ఒక రిపోర్ట్ ప్రకారం, ఎయిర్ టెల్, జియో, వొడాఫోన్, ఐడియా సంస్థలు అన్ని రీఛార్జ్ ప్లాన్లపై అదనంగా 20 శాతం పెంచే అవకాశముంది. టెలికాం సంస్థలకు చెందిన వివిధ వర్గాలు ఈ విషయాన్ని ధృవీకరించాయని ఆ రిపోర్టులో తెలిపింది. అయితే, ధరల పెరుగుదల ఆయా రీఛార్జ్ ప్లాన్‌ల ధరపై ఆధారపడి ఉంటుంది. కనీస రీఛార్జ్ ప్లాన్‌లకు తక్కువ పెంపు, ఎక్స్‌పెన్సివ్ రీఛార్జ్ ప్లాన్‌లకు కాస్త ఎక్కువ మొత్తంలో రేట్లు పెంచుతాయని రిపోర్ట్ తెలిపింది.
 
ఇంటర్‌కనెక్ట్ యూజ్ ఛార్జీలు (ఐయుసి) వల్ల కలిగే నష్టాలను భరించలేక రిలయన్స్ జియో ఇటీవలే తన కస్టమర్లకు ఓ షాక్ ఇచ్చింది. ఇతర నెట్‌వర్క్‌లకు అవుట్ గోయింగ్ కాల్స్ కోసం నిమిషానికి 6 పైసలు వసూలు చేయడం ప్రారంభించింది. అయితే జియో-టు-జియో కాల్స్ మాత్రం ఉచితం. జియో కస్టమర్లు దాని సేవలను ఉపయోగించటానికి కనీసం 10 రూపాయలు అదనంగా చెల్లించాలి.