శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. ఐటీ
  3. ఐటీ వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (16:46 IST)

రుణ యాప్‌లపై గూగుల్ సంచలన నిర్ణయం.. గూగుల్‌లో అలజడి.. ఏం జరిగింది?

సెర్చింజన్‌ దిగ్గజం గూగుల్‌లో వైవిధ్యం, నైతిక విలువలపై కొనసాగుతున్న వివాదాలు తీవ్రస్ధాయి స్ధాయికి చేరాయి. కృత్రిమ మేథ పరిశోధకుడు టిమ్నిట్‌ గెబ్రూపై గూగుల్‌ వేటు వేయడంతో ఇద్దరు టెకీలు సంస్థకు గుడ్‌బై చెప్పారు. 
 
యూజర్‌ భద్రత వ్యవహారాలను పర్యవేక్షించే డేవిడ్‌ బకర్‌ 16 ఏళ్ల పాటు సంస్థతో ఉన్న అనుబంధాన్ని తెంచుకున్నారు. గతనెల గూగుల్‌ను విడిచిపెడుతూ గెబ్రూ నిష్క్రమణతో గూగుల్‌లో తాను కొనసాగదల్చుకోలేదని బకర్‌ చెప్పారు.
 
వైవిధ్యంపై గూగుల్‌ దృష్టిసారిస్తున్నా సంస్థలోపల ఎన్నో గళాలను వినిపించకుండా పోయే పరిస్థితి నెలకొందని ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సెర్చింజన్‌ దిగ్గజంలో జరుగుతున్న పరిణామాలకు నిరసనగా మరో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ వినీష్‌ కన్నన్‌ గూగుల్‌ను వీడుతున్నట్టు బుధవారం ట్వీట్‌ చేశారు. గెబ్రూ, ఏప్రిల్‌ క్రిస్టియానాల పట్ల గూగుల్‌ తీరు ఆక్షేపణీయంగా ఉందని పేర్కొన్నారు. గెబ్రూ, క్రిస్టియానా ఇరువురూ నల్ల జాతీయులు కావడం గమనార్హం.
 
మరోవైపు రుణాలపై గూగుల్ సంచలన నిర్ణయం తీసుకుంది. లాక్‌డౌన్‌ ప్రభావంతో ఏర్పడిన ఆర్థిక కష్టాల సమయంలో రుణాలు ఇస్తామంటూ వెంటపడి ఇచ్చిన రుణ యాప్‌లు అనంతరం ఆ రుణాలు చెల్లించాలని తీవ్ర వేధింపులకు గురి చేసి పదుల సంఖ్యలో ప్రజలు బలవన్మరణానికి పాల్పడిన విషయం తెలిసిందే. 
 
డాటాను దుర్వినియోగం చేయడమే కాకుండా ఎక్కువ మొత్తం వడ్డీలు వసూలు చేస్తున్నారనే విషయాన్ని గూగుల్‌ గుర్తించి ఈ చర్యలు తీసుకుంది. ఆ యాప్‌లను ప్లే స్టోర్‌ నుంచి గూగుల్‌ తొలగించింది.