రిలయన్స్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్ అంటే ఏంటి?
ఉచిత కాల్స్, డేటాతో భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. మార్చి 31తో జియో ఉచిత సర్వీసులకు కాలం ముగుస్తుందనుకుంటున్న తరుణంలో జియో ప్రైమ్
ఉచిత కాల్స్, డేటాతో భారత టెలికాం రంగంలో సంచలనం సృష్టించిన రిలయన్స్ జియో వ్యూహాత్మకంగా మరో కొత్త ప్లాన్‌ను ప్రకటించింది. మార్చి 31తో జియో ఉచిత సర్వీసులకు కాలం ముగుస్తుందనుకుంటున్న తరుణంలో జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌ను తెరపైకి తెచ్చింది. దీంతో ఇతర ప్రైవేట్ టెలికామ్ రంగాలు ఆశ్చర్యపోయాయి. ఈ ప్రైమ్ మెంబర్‌షిప్ అంటే ఏంటి? దానివల్ల ప్రయోజనాలేంటి అనే విషయాన్ని పరిశీలిస్తే...
ప్రస్తుతం రిలయన్స్ జియోకు దేశ వ్యాప్తంగా 10 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉన్నారు. వీరంతా ఈ స్పెషల్ జియో ప్రైమ్ మెంబర్‌షిప్ ప్రోగ్రామ్‌లో చేరవచ్చు. దీనివల్ల అనేక ప్రయోజనాలను కంపెనీ కల్పించనుంది. ఇందులో చేరినవారు జియో హ్యాపీ న్యూ ఇయర్ ఆఫర్ కింద పొందుతున్న అపరిమిత వాయిస్, డేటా సర్వీసులను మరో ఏడాదిపాటు (2018 మార్చి 31 వరకు) పొందవచ్చు.
ఇందుకోసం వన్‌టైమ్ నమోదు రుసుం కింద 99 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 31 లోపు ఈ మొత్తాన్ని చెల్లించాలి. ఉచిత మొబైల్ డేటా, ఇతర ప్రయోజనాలు పొందాలనుకుంటే.. నెలకు 303 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే రోజుకు 10 రూపాయలన్న మాట. ఇలా చెల్లించిన వారు రోజుకు 1 జిబి (ఫెయిర్ యూసేజ్ పాలసీ) డేటాను పొందుతారు. అంతేకాకుండా జియో యాప్స్‌లోని మీడియా, కంటెంట్‌ను వాడుకోవచ్చు. జియో ప్రైమ్ ప్లాన్ ద్వారా కస్టమర్లు 10,000 రూపాయల విలువైన ప్రయోజనాలను పొందవచ్చని కంపెనీ వివరిస్తోంది.