శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జగన్ మోహన్ రెడ్డి
Written By Raju
Last Modified: హైదరాబాద్ , బుధవారం, 22 మార్చి 2017 (05:47 IST)

ఇలా చూపించి వెళ్లాలని నాకు తెలీదే.. జగన్ దెప్పుతో ఖంగు తిన్న రామకృష్ణుడు

బడ్డెట్‍‌పై ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైన యనమల వెనకా ముందూ చూసుకోకుండా చేసిన చిన్న వ్యాఖ్య ఆయన పరువును నిలువునా తీసేసేంది. ఒకరిని వాదనలో దెబ్బతీయడమే తప్ప తాను దెబ్బతిని ఎరుగని యనమల ఇలా అడ్డంగా బుక్కవటం చూసి టీడీపీ ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయ

శాసనసభలో అప్రమత్తంగా ఉండకపోతే, పొరపాటున మాట తూలితే ఎంతటి మహామహులకైనా సరే పరాభవం తప్పదని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు కోల్పోయిన పరువు సాక్షిగా నిరూపించారు. మంగళవారం బడ్డెట్‍‌పై ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చేందుకు సిద్ధమైన యనమల వెనకా ముందూ చూసుకోకుండా చేసిన చిన్న వ్యాఖ్య ఆయన పరువును నిలువునా తీసేసేంది. ఒకరిని వాదనలో దెబ్బతీయడమే తప్ప తాను దెబ్బతిని ఎరుగని యనమల ఇలా అడ్డంగా బుక్కవటం చూసి టీడీపీ ఎమ్మెల్యేలే ఆశ్చర్యపోయారు. 
 
విషయం ఏమిటంటే... గత రెండురోజులుగా రాష్ట్ర బడ్జెట్‌పై ఏపీ శాసన సభలో చర్చ జరుగుతోంది. చర్చకు ముగింపుగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రభుత్వం తరపున సమాధానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. అదే్ సమయంలోనే ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి సభలో లేకపోవడం యనమల గమనించారు. ఒక్క క్షణం వాకబు చేసి ఉంటే ఆయనకు విషయం అర్థమయ్యేది. 
 
ఆమాత్రం ఓపికలేని యనమల వైఎస్ జగన్‌పై వ్యంగ్య వ్యాఖ్య చేసి దెబ్బతీశానని సంబర పడ్డారు. ఇంతకూ యనమల ఏమన్నారు.. ‘ప్రతిపక్ష నేత బాయ్‌ కాట్‌ చేసినట్లా ఏదైనా పని ఉండి బయటకు వెళ్లినట్టా.. బాత్‌రూంకి వెళ్లినట్లా..’ అని వ్యంగ్యంగా వ్యాఖ్యలు చేశారు. అంతలోనే లోనికి వచ్చిన జగన్‌ చిటికెన వేలు చూపిస్తూ.. ఇలా చూపించి వెళ్లాలని తనకు తెలియదన్నారు.
 
నిజానికి ఏపీ శాసనసభలో అందరికంటే ఎక్కువ సమయం గడిపేది వైఎస్ జగన్, తనవాళ్లకు స్ఫూర్తి ఇవ్వడానికే అలా సభలో సుదీర్ఘ కాలం గడిపే జగన్ తనపై యనమల వ్యాఖ్యకు తట్టుకోలేకపోయారు. స్పీకర్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ.. వాష్‌రూంకి వెళ్లినా రాజకీయం చేస్తారా అధ్యక్షా, నాపై, లోకంలోనే లేని మా నాన్నపై ఎన్ని ఆరోపణలు చేస్తున్నా ఓపికగా వింటున్నాను. చివరికి టాయ్‌లెట్ వెళ్లినా ఏదో ఒక అభాండం వేయాలని చూడటం న్యాయమేనా అంటూ జగన్ నిలదీశారు. 
 
ప్రతిపక్ష నేతను బుక్ చేయబోయి తానే బుక్కయ్యిన ఆర్థికమంత్రిని చూసి టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా మౌనంగా ఉండిపోయారు. జగన్‌ను ఇరుకున పెట్టాలని చూసి యనమలే ఇరుక్కుపోయారని టీడీపీ సభ్యులు విచారం వ్యక్తం చేశారు. పాపం యనమల.