గురువారం, 28 మార్చి 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 వార్తలు
Written By వాసుదేవన్
Last Updated : మంగళవారం, 2 ఏప్రియల్ 2019 (16:42 IST)

స్మృతి ఇరానీ బొట్టుపై షాకింగ్ కామెంట్స్... ఆమె భర్తలను మార్చుతూ వుంటారు..

రాజకీయాలు, ఎన్నికలు ఈ ఎన్నికల హడావుడి, సందడి పోలింగ్ ముందు వరకు మాత్రమే. ఆ తేదీ కాస్త దాటేసిన తర్వాత అందరూ మళ్లీ మామూలుగానే ఎదురుపడ్డప్పుడు మాట్లాడుకుంటూ... తమ తమ పనుల కోసం పక్క పార్టీనా, స్వంత పార్టీనా అనే తేడా లేకుండా చేయించేసుకుంటూ పోతూ ఉంటారు. 
 
కానీ ఈ సందర్భంగా తమ గొప్పతనాన్ని ప్రదర్శించుకునేందుకు ప్రత్యర్ధి పార్టీలను ఉతికి ఆరేసేయడం కూడా చూస్తూనే ఉంటాము. అయితే.. కొందరు నేతలు మహిళా నేతలపై చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం వాళ్ల దిగజారుడుతనానికి ప్రతీకలుగా నిలిచిపోతున్నాయి.
 
వివరాలలోకి వెళ్తే... కాంగ్రెస్ మిత్రపక్ష పీఆర్‌పీ పార్టీనేత జయదీప్ కవాడే కేంద్రమంత్రి స్మృతి ఇరానీపై దారుణమైన వ్యాఖ్యలకు తెగబడ్డారు. తన నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకునే స్మృతి ఇరానీని ఉద్దేశిస్తూ... ఆమెకు ‘‘ఎంతమంది భర్తలు ఉన్నారో ఆ బొట్టుసైజు చూస్తేనే తెలుస్తోందంటూ’’ అవమానకరంగా మాట్లాడారు. ‘‘స్మృతి ఇరానీ గడ్కారీ పక్కన కూర్చుని, రాజ్యాంగాన్ని మార్చాలంటూ మాట్లాడతారు. స్మృతి ఇరానీ గురించి నేను మీతో ఒకటి చెప్పాలి. ఆమె తన నుదిటిపై పెద్ద బొట్టు పెట్టుకుంటారు. 
 
ఆమె తరచూ తన భర్తలను మార్చుతూ ఉంటారనీ.. అలా మార్చినప్పుడల్లా బొట్టు సైజు కూడా పెరుగుతుందని నాతో ఎవరో చెప్పారు...’’ అని కవాడే వ్యాఖ్యానించారు. రాజ్యాంగాన్ని మార్చాలన్న ఆలోచన అంత తేలికైందేమీ కాదని పేర్కొన్న ఆయన... ‘‘గడ్కారీ, మోడీలకు మంత్రిగా ఉన్న స్మృతి, పార్లమెంటులో కూర్చుని రాజ్యాంగాన్ని మార్చాలని చెబుతుంటారు.

కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి.... రాజ్యాంగాన్ని మార్చడం భర్తలను మార్చినంత సులువు కాదు...’’ అని పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మహిళా నేతలపై స్త్రీ విద్వేష వ్యాఖ్యలు చేస్తూండడం కొత్తేమీ కాకపోయినప్పటికీ.. ఇంత తీవ్రస్థాయిలో మాట్లాడడం ఇదే తొలిసారి.
 
అయితే, ఈ విషయంలో బీజేపీ అభ్యర్థులు కూడా ఏమీ తక్కువ తినలేదు... ఇటీవల బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ఓ ఎన్నికల సభలో మాట్లాడుతూ... ‘‘బీఎస్పీ చీఫ్ మాయావతి రోజూ ఫేషియల్ చేయించుకుంటారు. వయసు కనిపించకుండా జుట్టుకు రంగేసుకుంటారు. ఇంకోవైపు ప్రధానమంత్రి నరేంద్రమోడీ జీవన శైలిపై విమర్శలు చేస్తుంటారు...’’ అని పేర్కొన్న సంగతి తెలిసిందే. 
 
ఇదే నేత సోనియా గాంధీపై కూడా నోరు పారేసుకున్నారు. హర్యానా డ్యాన్సర్-సింగర్ సప్నా చౌదరి కాంగ్రెస్ పార్టీలో చేరితే గాంధీ ఫ్యామిలీకి సరిగ్గా సరిపోతారనీ... ఆమె కూడా సోనియా గాంధీ మాదిరిగానే మంచి డ్యాన్సర్ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. 
 
అక్కడితో ఆగకుండా, మరో అడుగుముందుకేసి... సోనియాలాగానే సాప్నా కూడా డ్యాన్సర్ కాబట్టి రాహుల్ గాంధీ ఆమెను వివాహం చేసుకోవాలని కూడా చెప్పుకొచ్చారు. కాగా ఇటీవల ఉత్తర ప్రదేశ్ తూర్పు విభాగం పార్టీ బాధ్యతలను చేపట్టిన ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపైనా కొందరు ఇదే తరహా వ్యాఖ్యలకు తెగిస్తున్న సంగతి తెలిసిందే. మరి మహిళా హక్కులు, మహిళా రక్షణలు అంటూ మాట్లాడే పెద్ద మనుషులు వీళ్లేనా ఏమో మరి.