మంగళవారం, 16 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. ఎన్నికలు 2019
  3. లోక్ సభ ఎన్నికలు 2019 ప్రముఖ నియోజకవర్గం
Written By మోహన్
Last Updated : గురువారం, 28 మార్చి 2019 (15:24 IST)

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో 'నాని'లు ఎక్కువయ్యారు...?

సాధారణంగా మన ఇళ్లలో చాలా మందిని ముద్దు పేరుతో నాని అని పిలుస్తుంటారు. ఆ పేరు కాస్త ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్‌లలో ఎక్కడ చూసినా హాట్ టాపిక్‌గా మారింది. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో మూడు ప్రధాన పార్టీల తరపున వందలాది మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. వారిలో నాని ముద్దుపేరుగా కలిగిన ఆరుగురు అభ్యర్థులు మాత్రం అధికార, ప్రతిపక్ష పార్టీల తరపున సందడి చేస్తున్నారు. 
 
అసలు పేరు ఒకటైతే నాని ముద్దుపేరే అసలు పేరుగా ఓటర్లలోకి దూసుకుపోతున్నారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో సైతం అధికార టీడీపీ, ప్రతిపక్ష వైసీపీ ఎంపిక చేసిన అభ్యర్థుల్లో ఆరుగురు నానిలు వివిధ నియోజకవర్గాల నుంచి పోటీ చేస్తున్నారు. అసలు పేర్లు వేరైనా నాని ముద్దు పేరుతోనే తమ నియోజకవర్గాలలో సుపరిచితులైన ఈ నానిలు ఇటు టీడీపీ నుండి, అటు వైసీపీల నుంచి పోటీకి దిగారు. వీరిలో కృష్ణాజిల్లా నుంచి ముగ్గురు, పశ్చిమగోదావరి జిల్లా నుంచి ఇద్దరు నానిలు ఉంటే చిత్తూరు జిల్లా నుంచి సింగిల్ నాని మాత్రమే బరిలో నిలిచారు. 
 
విజయవాడ లోక్‌సభ స్థానంలో టీడీపీ సిట్టింగ్ ఎంపీ కేశినేని నాని వరుసగా రెండోసారి తన అదృష్టం పరీక్షించుకుంటున్నారు. కేశినేని నానిగా సుపరిచితమైన ఈయన అసలు పేరు కేశినేని శ్రీనివాస్. మరోవైపు విజయవాడ చెంతనే ఉన్న గుడివాడ అసెంబ్లీ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న కొడాలి నాని సైతం శాసనసభ్యుడిగా, సినీ నిర్మాతగా నాని పేరుతోనే గుర్తింపు తెచ్చుకొన్నారు. కొడాలి నాని అసలు పేరు కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు అని చాలామందికి తెలియకపోవడం విశేషం. 
 
గుడివాడకు కూతవేటు దూరంలో ఉన్న మచిలీపట్నం శాసనసభ స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా సమరానికి సిద్ధం అంటున్న అభ్యర్థి పేరు సైతం నానినే. పేర్ని నానిగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన పేరు పేర్ని వెంకట్రామయ్య. పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లి గూడెం టీడీపీ అభ్యర్థి ఈలి నాని అసలు పేరు వెంకట మధుసూదనరావు. 
 
అయితే ఆయన రాజకీయవర్గాలలో ఈలి నాని పేరుతోనే గుర్తింపు పొందారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీలో ఉన్న ఆళ్ల నాని అసలు పేరు కాళీ కృష్ణ. అయితే ఆళ్ల నానిగానే ఆయన అందరికీ సుపరిచితులు. చిత్తూరు జిల్లా చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని సైతం ఎన్నికల బరిలో నిలిచారు. పులివర్తి నాని అసలు పేరు వెంకట మణిప్రసాద్. మరి ఈ ఆరుగులు నానిల్లో ఎందరు శాసనసభ, లోక్‌సభలో అడుగుపెడతారో మే 23వ తేదీన తేలనుంది.