భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్: ఉరితీతను అనుకరించబోయి చిన్నారి మృతి
స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల కోసం విప్లవ యోధుడు భగత్ సింగ్ నాటకం రిహార్సల్స్ చేస్తూ ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాధకర ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. యూపీలోని బుదౌన జిల్లాలోని బబత్‌లో ఓ పాఠశాల ఉంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భగత్ సింగ్ జీవిత కథ ఆధారంగా నాటకం ప్రదర్శన చేయాలని పలువురు విద్యార్థులు నిర్ణయించుకున్నారు.
ఇందులో భాగంగా భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ పాత్రల్లో ఒకడిగా విద్యార్థి శివమ్(9) నటించేందుకు ముందుకు వచ్చాడు. అయితే, స్వాతంత్ర్య దినోతవ్స వేడుకలు సమీపిస్తుండటంతో వీరంతా రిహార్సల్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో భగత్ సింగ్ ఉరితీతను అనుకరించబోయాడు శివమ్. స్టూల్ ఎక్కి మెడకు ఉరి వేసుకున్నాడు శివమ్. దురదృష్టవశాత్తు కాళ్లు జారడంతో శివమ్ మెడకు ఉరి బిగుసుకుపోయింది.
దాంతో అతను గిలగిలా కొట్టుకున్నాడు. అది గమనించిన శివమ్ మిత్రులు.. నటిస్తున్నాడని భావించారు. కానీ, ఊపిరి ఆడక శివమ్ ప్రాణాలు కోల్పోయాడు. ఎలాంటి కదలికలు లేకపోవడంతో భయపడ్డ మిత్రులు.. వెంటనే చుట్టుపక్కన వారికి సమాచారం అందించారు. వారు వచ్చి చూసే సరికి శివమ్ ప్రాణాలు విడిచాడు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు బోరున విలపించారు.