రహస్యంగా ప్రియురాలి ఇంటికెళ్లిన ప్రియుడు.. పాక్‌లో అడుగుపెట్టి చిక్కుల్లో... ఎలా?
రాజస్థాన్‌కు చెందిన 19 యేళ్ళ యువకుడు చిక్కుల్లో పడ్డాడు. తన ప్రియురాలిని కలుసుకునేందుకు ఆమె ఇంటికి రహస్యంగా వెళ్ళాడు. ఇంట్లోకి అడుగుపెట్టిన తర్వాత యువతి తల్లిదండ్రులు వచ్చారు. వారి కంటకనపడకుండా ఉండేందుకు తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా, ఇంటి వెనుకభాగం నుంచి పారిపోతూ పొరపాటున పాకిస్థాన్ భూభాగంలోకి అడుగుపెట్టాడు. అంతే.. పాక్ పోలీసులు ఆ యువకుడిని అరెస్టు చేసి, రాజస్థాన్ పోలీసులకు సమాచారం చేరవేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రంలోని గెమ్రా రామ్మేఘ్‌వల్ (19) భారత్ - పాకిస్థాన్ సరిహద్దులోని కుంహారా కా టిబ్బా ప్రాంతంలో నివసిస్తున్నాడు. గతేడాది నవంబరులో ప్రియురాలిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లాడు. అదేసమయంలో ఆమె తల్లిదండ్రులు రావడంతో అక్కడి నుంచి దౌడుతీశాడు. అలా పారిపోతూ పొరపాటున భారత సరిహద్దు దాటి పాకిస్థాన్‌లో అడుగుపెట్టాడు.
దీన్ని గమనించిన పాక్ సరిహద్దు భద్రతా బలగాలు... గెమ్రాను అరెస్టు చేసి, విచారణ అనంతరం రాజస్థాన్ పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలిసిన యువకుడి తల్లిదండ్రులు గెమ్రాను వీలైనంత త్వరగా భారత్‌కు రప్పించాలని కోరుతూ స్థానిక బీజేపీ నాయకులతో కలిసి కలెక్టర్‌ను వేడుకున్నారు.
ఈ కేసును పరిశీలిస్తున్న బీఎస్ఎఫ్ అధికారి ఒకరు మాట్లాడుతూ, పాకిస్థాన్ రేంజర్లతో చర్చలు జరుపుతున్నామన్నారు. యువకుడు సింధ్ పోలీసుల అధీనంలో ఉన్నాడని, చట్టపరమైన చర్యల అనంతరం అతడిని భారత్‌కు అప్పగిస్తారని తెలిపారు.