మధ్యప్రదేశ్ రాష్ట్రంలో నదిలోపడిన బస్సు.. ముగ్గురు మృతి
మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు అదుపుతప్పి నదిలోపడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు.
ఆదివారం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే, అలీరాజ్‌పూర్ జిల్లాలోని ఖాండ్వా బరోడా రహదారిపై కొంతమంది ప్రయాణికులతో వేగంగా వెళుతున్న బస్సు ఒకటి అదుపుతప్పి నదిలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రమాద స్థలంలోనే ప్రాణాలు కోల్పోగా మరో 28 మంది గాయపడ్డారు.
గాయపడిన వారిని జిల్లా ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు ప్రమాద స్థలానికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. గాయపడిన వారిలో ఏడుగురు చిన్నారులు కూడా ఉన్నారు.