ఉత్తరాఖండ్‌లో లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. 36 మంది మృతి
ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒకటి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 36 మంది మృత్యువాతపడగా, మరికొందరు గాయపడ్డారు. ప్రమాద స్థలంలో సీఆర్పీఎఫ్ సిబ్బంది స్థానిక పోలీసులు, ప్రజలతో కలిసి సహాయక చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడగా, వీరిలో పలువురు పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలోని అల్మోరా జిల్లా ప్రభుత్వ అధికారులు వెల్లడించిన వివరాల మేరకు.. గర్వాల్ నుంచి కుమావూ వెళుతున్న బస్సు మార్చులా వద్ద అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న 200 అడుగుల లోతులో ఉండే లోయలోపడిపోయింది. దీంతో బస్సులోని 40 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. అడుగులో 36 మంది అక్కడికక్కడే చనిపోయారు. స్థానికుల సమాచారంతో వేగంగా స్పందించిన అదికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రెవెన్యూ ఆపరేషన్‌లో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది కూడా పాల్గొన్నారు.
క్షతగాత్రుల ప్రాణాలు రక్షించేందుకు అధికారులు శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, ఈ ప్రమాదం వార్త తెలియగానే ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. మృతుల కుటుంబాలకు ఆయన తన ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియజేశారు. ప్రభుత్వం తరపున ఒక్కో మృతుని కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తుందని ప్రకటించారు. అలాగే, క్షతగాత్రులకు రూ.లక్ష చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.