జుట్టుకు రంగేసుకుని అయ్యప్ప గుడిలోకి వెళ్లా : 36 యేళ్ళ దళిత మహిళ
సుప్రీంకోర్టు తీర్పుతో శబరిమల అయ్యప్ప ఆలయంలోకి వెళ్లేందుకు మహిళలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కేరళ ప్రభుత్వం కూడా మహిళలకు ప్రవేశం కల్పించేందుకు శాయశక్తులా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం పోలీసు భద్రతను కూడా కల్పించింది. కానీ, మహిళలకు ప్రవేశం అసాధ్యంగా మారింది.
ఈ నేపథ్యంలో ముగ్గురు మహిళలను పోలీసు బలగాలు అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ స్వామి దర్శనానికి తీసుకెళ్లాయి. వీరిలో ఒకరు శ్రీలంక మహిళ కూడా ఉన్నారు. తాజాగా మరో దళిత మహిళ శబరిమల ఆలయంలోకి వెళ్లింది. 50 యేళ్ళ మహిళలా కనిపించేందుకు వెంట్రుకలకు రంగు వేసుకుని ఆలయంలోకి వెళ్ళింది. ఆమె పేరు పి.మంజు. వయసు 36 యేళ్లు. ఈ విషయాన్ని తన ఫేస్‌బుక్ ఖాతాలో వెల్లడించింది. అంతేకాదు, అయ్యప్పను దర్శించుకుంటున్న ఫొటోను కూడా పోస్టు చేసింది.
ఇదే అంశంపై ఆమె మాట్లాడుతూ, అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్లేందుకు తాను పోలీసుల రక్షణ కోరలేదని చెప్పింది. 50 యేళ్ళ మహిళలకు ప్రవేశం ఉంది కనుక వారితో కలిసి ఆలయంలోకి వెళ్లినట్టు చెప్పింది. 18 మెట్లు ఎక్కి అయ్యప్ప స్వామిని దర్శనం చేసుకున్నట్టు తెలిపింది. కాగా, గత అక్టోబరులో ఆలయంలోకి వెళ్లేందుకు విఫలయత్నం చేసిన 20 మంది మహిళలలో మంజు కూడా ఒకరు కావడం గమనార్హం. విషయం తెలిసిన ఆందోళనకారులు కొల్లాంలోని ఆమె ఇంటిపై అప్పట్లో దాడి చేశారు. తాజాగా మంజు ఫేస్‌బుక్ పోస్టుతో మరోమారు కలకలం రేగింది. దీంతో ఆమె ప్రాణభయంతో వణికిపోతోంది.