శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By
Last Updated : శుక్రవారం, 11 జనవరి 2019 (10:36 IST)

మొసలి అంత్యక్రియలకు ఊరంతా తరలి వచ్చింది...

ఎవరైనా చీటికిమాటికి ఏడుస్తుంటే మొసలి కన్నీరు పెట్టకు అని అంటుంటారు. కానీ, నిజంగానే ఒక మొసలి చనిపోవడంతో ఆ ఊరు ఊరంతా కన్నీరు కార్చింది. తమ గ్రామ ప్రజలు దైవంగా భావించే మొసలి చనిపోవడంతో గ్రామంలోని 500 మంది ప్రజలు ఒక రోజంతా భోజనం చేయలేదు. అంతేనా, ఈ మొసలి అంత్యక్రియల కోసం గ్రామమంతా తరలి వచ్చింది. ఇంతకీ ఈ సంఘటన ఎక్కడ జరిగిందో ఓసారి తెలుసుకుందాం. 
 
ఛత్తీస్‌గఢ్‌లోని బెమెతారా జిల్లాలో బవామొహ్ తారా గ్రామంలో పెద్ద చెరువు ఒకటి ఉంది. ఈ చెరువులో వందేళ్లకుగాపైగా ఓ మొసలి జీవిస్తూ వచ్చింది. దీంతో ఆ మొసలిని ఆ గ్రామ ప్రజలంతా తమ గ్రామ దైవంగా భావించి పూజిస్తూ వచ్చారు. పైగా, ఈ మొసలికి గంగారాం అనే పేరు కూడా పెట్టుకున్నారు. ఈ మొసలి ఇటీవల చనిపోయింది. 
 
ఆ తర్వాత అటవీ అధికారులకు సమాచారం చేరవేశారు. వీరితో పాటు గ్రామస్థులంతా చనిపోయిన మొసలిని వెలికి తీసి, భక్తితో తాకి, తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు. ఈ మొసలి 3.4 మీటర్ల పొడవు, 250 కేజీల బరువు ఉన్నట్టు వెల్లడించారు. అంతేకాకుండా, చెరువు ఒడ్డున స్మారక స్థూపం ఏర్పాటు చేయడానికి నిర్ణయించినట్లు గ్రామ సర్పంచ్ వెల్లడించారు. ప్రస్తుతం ఈ న్యూస్ హాట్ టాపిక్ అయ్యింది.