శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (09:29 IST)

రోజులో 7 గంటలు సెల్‌ఫోన్‌తోనే..!

కొవిడ్‌ నేపథ్యంలో ఇంటి నుంచి పని, ఆన్‌లైన్‌ తరగతులు తప్పనిసరి అయ్యాయి. ఇందుకు స్మార్ట్‌ఫోన్‌ వాడుతున్నారు. దీంతోపాటు వినోదం కోసం చిత్రాలు, వీడియోలు చూసేందుకూ స్మార్ట్‌ఫోన్‌నే వినియోగించడం పెరిగింది.

ఫలితంగా రోజులో సగటున 7 గంటల పాటు సెల్‌ఫోన్‌తోనే ప్రజలు గడుపుతున్నారని సీఎంఆర్‌-వివో సంస్థల అధ్యయనంలో తేలింది. 2019లో రోజులో సగటున 4.9 గంటలు, 2020 మార్చిలో 5.5 గంటల సేపు స్మార్ట్‌ఫోన్‌ను వినియోగించారని గుర్తించారు. మార్చి చివరిలో లాక్‌డౌన్‌ విధించడంతో, సెల్‌ఫోన్‌ అవసరం పెరిగింది.

ఫలితంగా ఏప్రిల్‌లోనే సెల్‌ఫోన్‌ వినియోగం 25 శాతం అధికమై 6.9 గంటలకు చేరిందని ‘స్మార్ట్‌ఫోన్లు-మానవ సంబంధాలపై ప్రభావం’ నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌, విశాఖపట్నం, బెంగళూరు, అహ్మదాబాద్‌, పుణె నగరాలలోని 2000 మంది పురుషులు-మహిళల నుంచి సేకరించిన అభిప్రాయాలతో రూపొందించిన నివేదికలోని మరిన్ని అంశాలివీ.. 
 
* లాక్‌డౌన్‌ సమయంలో ఇంటి నుంచి పనికి స్మార్ట్‌ఫోన్‌ వాడటం 75 శాతం పెరిగింది. కాల్స్‌ చేసేందుకు 63 శాతం, నెట్‌ఫ్లిక్స్‌ వంటి ఓటీటీ మాధ్యమాలు తిలకించేందుకు 59 శాతం అధికంగా వినియోగించారు.
 
* 84 శాతం మంది నిద్ర లేవగానే తొలి 15 నిమిషాలలోనే తమ స్మార్ట్‌ఫోన్‌ పరిశీలించుకుంటారు.  తమ ఫోన్‌ వినియోగ తీరును ఎదుటివారు ఎత్తి చూపుతున్నారని ప్రతి 8 మందిలో ఏడుగురు అంగీకరించారు.
 
* కొవిడ్‌కు ముందు కుటుంబ సభ్యులతో గడిపే సమయం రోజులో 4.4 గంటలు ఉంటే, ఇప్పుడు 5.5 గంటలకు పెరిగింది. అయితే స్మార్ట్‌ఫోన్‌ వల్ల సన్నిహితులతో నాణ్యతతో గడిపే సమయం తగ్గిందని  తెలిపారు.
 
* ప్రస్తుత తరహాలోనే సెల్‌ఫోన్‌ వినియోగం పెరుగుతూ పోతే, శారీరక/మానసిక ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని 70% మంది అంగీకరించారు.
 
* కొవిడ్‌ ప్రభావం తగ్గుముఖం పడితే, సెల్‌ఫోన్‌ వినియోగం కూడా తగ్గొచ్చని వివో ఇండియా డైరెక్టర్‌ నిపున్‌ మార్యా అభిప్రాయం వ్యక్తం చేశారు.