శనివారం, 20 ఏప్రియల్ 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 26 డిశెంబరు 2020 (09:10 IST)

నాలుగు రాష్ట్రాల్లో టీకా 'డ్రై రన్‌'

దేశవ్యాప్తంగా ప్రజలకు కొవిడ్‌ వ్యాక్సిన్‌ అందించే ఏర్పాట్లు కొంతకాలంగా సాగుతున్నాయి. దీనిలో భాగంగా నాలుగు రాష్ట్రాల్లో టీకా సన్నాహక కార్యక్రమాన్ని ఈనెల 28, 29 తేదీల్లో నిర్వహించనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది.

టీకా రిహార్సల్‌ అని చెప్పుకునే ఈ 'డ్రై రన్‌' కార్యక్రమ నిర్వహణకు కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌, పంజాబ్‌, అసోం, గుజరాత్‌ రాష్ట్రాలను ఎంపిక చేసింది. ఆయా రాష్ట్రాల్లో రెండు జిల్లాల చొప్పున మొత్తం ఎనిమిది జిల్లాల్లో ఇది జరగనుంది.

రెండు రోజుల పాటు జరిగే ఈ డ్రై రన్‌లో వ్యాక్సిన్‌ ఇవ్వటం మినహా మిగిలిన దశలను పరిశీలిస్తారు. వ్యాక్సిన్‌ ఇచ్చిన తరువాత ఎదుదుకానున్న పరిణామాలపై ఏమేరకు అప్రమత్తంగా ఉన్నామో ఒక అంచనాకు వస్తారు.

దీంతో పాటుగా వ్యాక్సిన్‌ రిజిస్ట్రేషన్‌ యాప్‌ కోావిన్‌ వినియోగం, వ్యాక్సిన్‌ నిల్వ, రవాణా, ఇంకా వ్యాక్సిన్‌ ఇచ్చే క్రమంలో భౌతిక దూరం పాటించేలా ప్రజలు అదుపుచేసే విధానంపై అధ్యయనం చేస్తారు. ముఖ్యంగా టీకా వేసే కేంద్రం వైరస్‌ వ్యాప్తికి అవకాశం ఇవ్వకుండా తీసుకోవాల్సిన చర్యలను పరిశీలిస్తారు.

వ్యాక్సిన్‌ పంపిణీలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు ఈ ముందస్తు డ్రైరన్‌ ఉపయోగపడుతుందని పంజాబ్‌ ఆరోగ్య మంత్రి బల్బీర్‌ సింగ్‌ అన్నారు. వ్యాక్సిన్‌ పంపిణీ చేసే సిబ్బందికి ఇప్పటికే దేశవ్యాప్తంగా శిక్షణా కార్యక్రమం మొదలైంది. ఇందులో భాగంగా 2,360 సెషన్లలో, 7 వేల మంది వైద్య సిబ్బంది, అధికారులకు శిక్షణ ఇచ్చింది.