బుధవారం, 13 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఎం
Last Updated : బుధవారం, 23 డిశెంబరు 2020 (12:18 IST)

ఏ వ్యాక్సిన్‌ వైపు కేంద్రం మొగ్గు?

దేశంలో మరి కొద్దివారాల్లో టీకా అందుబాటులోకి రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ గత నెలలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇందుకు అనుగుణంగా టీకా పంపిణీకి ఏర్పాట్లు సాగుతున్నాయి. దేశంలో కరోనా టీకా అత్యవసర వినియోగానికి ఫైజర్, ఆక్స్‌ఫర్డ్, భారత్ బయోటెక్ సంస్థలు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో వచ్చేవారమే కోవిడ్ టీకా అత్యవసర వినియోగానికి అనుమతి వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా కరోనా టీకాకు డీసీజీఐ అనుమతించనుందని రాయిటర్స్‌కు వెల్లడించాయి.

సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ) అధికారులు అదనపు సమాచారాన్ని కోరడంతో స్థానికంగా ఈ టీకా క్లినికల్ ట్రయల్స్ నిర్వహిస్తోన్న సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సమర్పించినట్టు తెలిపాయి

కేంద్రం అనుమతి లభిస్తే ఆక్స్‌ఫర్డ్‌కు అనుమతించిన తొలి దేశంగా భారత్ నిలవనుంది. ఆక్స్‌ఫర్డ్ టీకా ఫలితాలను ఇప్పటికే బ్రిటిష్ రెగ్యులేటరీ విశ్లేషిస్తోంది. ప్రపంచంలోనే పెద్ద ఎత్తున టీకాలను భారత్ ఉత్పత్తి చేస్తోంది.

వచ్చే నెలలోనే పౌరులకు అత్యవసర వినియోగం కింద టీకాను అందజేయడానికి ప్రయత్నాలు ప్రారంభించింది.
ప్రపంచంలోనే అత్యధిక కరోనా కేసులు నమోదయిన దేశాల జాబితాలో రెండో స్థానంలో ఉన్న భారత్‌.. టీకాకు ఆమోదం తెలిపితే మహమ్మారిపై పోరాటంలో కీలక పరిణామం అవుతుంది.

తక్కువ ధరకే లభ్యంకావడం, రవాణా, సాధారణ రిఫ్రిజిరేటర్‌లోనే భద్రపరచే వెసులుబాటు వంటి కారణాలతో ఆక్స్‌ఫర్డ్-ఆస్ట్రాజెన్‌కా టీకాకే ఆల్పాదాయ దేశాలు మొగ్గుచూపుతున్నాయి.