బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 6 జనవరి 2021 (17:01 IST)

కరోనా వ్యాక్సిన్లు సిద్ధం... ఇంకా ఖరారు కాని ధర!

కరోనా భయంతో వణికిపోతున్న దేశ ప్రజలకు కాస్తంత ఉపశమనం కల్పించేందుకు తయారు చేసిన వ్యాక్సిన్లు ప్రస్తుతం అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో తయారైన ఈ వ్యాక్సిన్లు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. అయితే, కరోనా టీకాల ధరను మాత్రం కేంద్రం ఇంకా ఖరారు చేయలేదు. దీంతో ఈ వ్యాక్సిన్ కిట్లు ఫార్మా కంపెనీల్లోనే నిల్వవున్నాయి. 
 
నిజానికి అగ్రరాజ్యాలైన అమెరికా, బ్రిటన్, చైనా దేశాలు తమ ప్రజలకు సాధ్యమైనంత త్వరగా వ్యాక్సిన్ ఇవ్వాలని భావిస్తున్నాయి. ఇప్పటికే అత్యవసర వినియోగం కింద అనుమతి పొందిన వ్యాక్సిన్‌లను ప్రజలకు పంచుతున్నాయి. 
 
అయితే, రెండు వ్యాక్సిన్లకు అనుమతినిచ్చిన భారత్.. వాటి వ్యాక్సినేషన్‌ను ఇంకా ప్రారంభించలేదు. ప్రస్తుతం ఇండియాలో దాదాపు 7 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు సిద్ధంగా ఉన్నాయి. అంటే, దాదాపు 3.5 కోట్ల మందికి టీకా ఇవ్వవచ్చు. అయినా ఇంకా పంపిణీకి అనుమతి లభించలేదు.
 
మిగతా దేశాల్లో అనుమతి లభించిన గంటల వ్యవధిలోనే వ్యాక్సినేషన్ ప్రక్రియ మొదలైపోయింది. ఆయా వ్యాక్సిన్ సంస్థలతో టీకా ధర నిర్ణయం ఆయా దేశాల్లో మొదటే జరిగిపోయింది. కానీ మనదేశంలో మాత్రం వ్యాక్సిన్‌కు ధర నిర్ణయించే విషయంలో మీనమేషాలు లెక్కిస్తూనే ఉన్నారు. 
 
టీకా తయారీ కంపెనీలు, కేంద్రానికి మధ్య ఇంకా ప్రైసింగ్ అగ్రిమెంట్ కుదరలేదు. కొన్ని నెలలుగా చర్చలు సాగుతున్నా ఇంకా సరఫరా ఒప్పందం కూడా కుదరలేదు. ముఖ్యంగా ఆక్స్ ఫర్డ్ - ఆస్ట్రాజెనికాలు తయారు చేసిన వ్యాక్సిన్‌ను ఇండియాలో పుణె కేంద్రంగా నడుస్తున్న సీరమ్ ఇనిస్టిట్యూట్ తయారు చేస్తోంది. 
 
సీరమ్‌కు, కేంద్రానికి మధ్య ఇప్పటికే పలు దఫాలుగా చర్చలు సాగినా, ధర విషయంలో మాత్రం నిర్ణయం తీసుకోలేకపోవడం గమనార్హం. ఇటీవల మీడియాతో మాట్లాడిన సీరమ్ చీఫ్ అదార్ పూనావాలా, తమకు కేంద్రం నుంచి 10 కోట్ల డోస్‌లకు నోటిమాత్రంగా ఆర్డర్ వచ్చిందని, ఒక్కోటి రూ.200కు (2.74 డాలర్లు) కావాలని అడిగారని వెల్లడించారు. అయితే, కేంద్ర ప్రభుత్వం మాత్రం ధరను మరింతగా తగ్గించాలని సీరమ్‌పై ఒత్తిడి తెస్తోంది.