శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 31 జనవరి 2020 (13:07 IST)

20 మంది చిన్నారులను నిర్భంధించాడు.. పోలీసులు కాల్చి చంపేశారు..

ఓ హత్యకేసులో నిందితుడిగా వున్న ఓ నిందితుడు చేసిన పని.. యూపీలో తీవ్ర ఉత్కంఠను రేపుతోంది. పుట్టినరోజు వేడుక అంటూ ఆహ్వానించి ఇంట్లో 20 మంది చిన్నారులను నిర్భంధించాడు. ఉత్తరప్రదేశ్‌లో ఈ ఘటన కలకలం రేపింది. 
 
వివరాల్లోకి వెళితే.. ఓ హత్య కేసులో నిందితుడిగా వున్న సుభాష్ బాథమ్ అనే వ్యక్తి.. తన కుమార్తె పుట్టిన రోజుల వేడుకల కోసం ఇరుగుపొరుగున వున్న చిన్నారులను ఆహ్వానించాడు. అలా ఇంటికొచ్చిన 20మంది పిల్లల్ని ఓ ఇంట్లో బంధించాడు. ఇంకా ఆ ఇంట్లో కాల్పుల శబ్ధం రావడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు చెలరేగాయి. అతడితో చర్చకు ప్రయత్నించిన వారిపై కూడా సుభాష్ కాల్పులు జరిపాడు.
 
ఇంకా పోలీసుల పైకి గ్రెనెడ్ విసరడంతో పరిస్థితి ఉద్రికంగా మారింది. ఈ ఘటనను సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. యూపీలోని ఫరూఖాబాద్, కసారియా గ్రామంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. బందీలెవరికి ఎలాంటి హాని కలగకుండా తక్షణం విడిపించే ప్రయత్నం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. 
 
బందీల్లో ఎక్కువమంది ఐదేళ్ల నుంచి ఏడేళ్ల లోపు వున్నవారేనని అధికారులు చెప్తున్నారు. అయితే ఈ ఆపరేషన్‌లో పోలీసులు సక్సెస్ అయ్యారు. సుభాష్ బాథమ్‌ను గురువారం అర్థరాత్రి దాటిన తర్వాత పోలీసులు కాల్చి చంపేశారు. పిల్లలను ఇంటి నుంచి సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. వారి తల్లిదండ్రులకు అప్పగించారు. చిన్నారులను నిర్భంధించిన నిందితుడి మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు చెప్తున్నారు.