శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 17 జనవరి 2020 (11:15 IST)

భార్యను ముక్కలుముక్కలుగా నరికేసిన భర్త.. ఎందుకంటే...

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో దారుణం జరిగింది. ఓ కసాయి భర్త కట్టుకున్న భార్యను ముక్కలు ముక్కలుగా నరికేశాడు. దీనికి కారణం తెలిస్తే ప్రతి ఒక్కరూ విస్తుపోతారు. మూడోసారి ఆడపిల్లే పడుతుందని తేలడంతో ఆ కసాయి ఈ దారుణానికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని రాయ్‌బరేలీ జిల్లా డీహ్ అనే గ్రామంలో జరిగింది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, డీహ్‌ గ్రామానికి చెందిన రవీంద్రకుమార్‌(35), ఊర్మిళ(27) అనే భార్యభర్తలు ఉన్నారు. వీరికి 2011లో వివాహమైంది. ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు పుట్టారు. ఈ క్రమంలో ఊర్మిళ మూడోసారి గర్భందాల్చింది. అయితే, ఈసారి కూడా ఆమె అమ్మాయికే జన్మనిస్తుందని అనుమానించిన భర్త రవీంద్రకుమార్ భార్యను హింసించడం మొదలుపెట్టాడు. దీంతో ఈ నెల 12న ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 
కట్టుకున్న భార్య తనపై పోలీసులకు ఫిర్యాదు చేయడాన్ని అవమానంగా భావించిన రవీంద్రకుమార్ ఆమెను అంతం చేయాలని ప్లాన్ వేశాడు. ఈ క్రమంలో ఉద్దేశ్యపూర్వకంగా భార్యతో గొడవ పెట్టుకుని.. ఆమె గొంతునులిమి చంపేశాడు. ఆ తర్వాత తన తండ్రి, సోదరుల సహాయంతో భార్య శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి పిండిమరలో వేసి ముద్దచేశాడు. అక్కడితోనూ ఆగక కాల్చి బూడిద చేశాడు. ఆ తర్వాత మూటకట్టి అటవీ ప్రాంతంలో పడేశాడు. ఆ తర్వాత తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
 
అయితే, తమ తల్లిని తండ్రి చంపడాన్ని కళ్ళారా చూశామని పెద్ద కుమార్తె అమ్మమ్మకు చెప్పింది. ఆమె ద్వారా విషయం తెలుసుకున్న ఊర్మిళ సోదరి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు తమదైన శైలిలో విచారించగా నిందితుడు నేరాన్ని అంగీకరించాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.