సోమవారం, 25 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జనవరి 2020 (10:13 IST)

జస్ట్ గంటన్నర ఆలస్యమైన తేజాస్ ఎక్స్‌ప్రెస్... నష్టపరిహారం చెల్లించిన ఐఆర్‌సీటీసీ

రైలు గమ్యస్థానానికి చేరాల్సిన సమయం కంటే గంటన్నర ఆలస్యంగా వచ్చింది. దీనికి భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) ఆ రైలులో ప్రయాణించిన ప్రయాణికులకు నష్టపరిహారం చెల్లించింది. ఈ ఘటన ముంబైలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, అహ్మదాబాద్ - ముంబై ప్రాంతాల మధ్య తేజాస్ పేరుతో ఐఆర్‌సీటీసీ ఓ ప్రైవేట్ ఎక్స్‌ప్రెస్ రైలును నడుపుతోంది. ఈ ఎక్స్‌ప్రెస్ రైలు గంటన్నర సేపు ఆలస్యంగా చేరుకుంది. దీంతో ఐఆర్‌సీటీసీ అధికారులు ప్రయాణికులకు రూ.63వేలను నష్టపరిహారం కింద చెల్లించారు. ఈ ప్రైవేటు రైలు దేశంలో నడుస్తున్న రెండో రైలు. 
 
ఈ నెల 19వతేదీన తేజాస్ ఎక్స్‌ప్రెస్ అహ్మదాబాద్ నుంచి ఉదయం 6.42 గంటలకు ముంబైకు బయలుదేరింది. ముంబై నగరానికి గంటన్నర సేపు ఆలస్యంగా చేరింది. మధ్యాహ్నం 1.10 గంటలకు రావాల్సిన రైలు మధ్యాహ్నం 2.36 గంటలకు చేరింది. ముంబై నగర శివార్లలోని భయందర్, దహిసర్ రైల్వేస్టేషన్ల మధ్య సాంకేతిక లోపం వల్ల తేజాస్ రైలు ఆలస్యంగా చేరుకుందని రైల్వే అధికారులు వివరించారు.
 
అయితే, ఇవేమీ పట్టించుకోని ప్రయాణికులు నష్టపరిహారం కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఐఆర్‌సీటీసీ 630 మంది ప్రయాణికులకు రూ.63 వేలు నష్టపరిహారంగా చెల్లించినట్టు ఆ సంస్థ అధికార ప్రతినిధి వెల్లడించారు.