పట్టాలపైకి 'తేజస్' ప్రైవేటు రైలు.. ఆలస్యమైతే ప్రయాణికులకు పండగే!
దేశంలోనే తొలిసారి ప్రైవేటు రైలు పరుగులు తీయనుంది. తేజస్ పేరుతో ఈ రైలు నడవనుంది. ఢిల్లీ నుంచి లక్నోల మధ్య ఈ నెల నాలుగో తేదీ నుంచి దౌడు తీయనుంది. ఇందుకోసం కేంద్ర రైల్వే శాఖతో పాటు.. ఐఆర్‌సీటీసీ అనుమతి ఇచ్చింది. అయితే, మన రైళ్లు గంటల కొద్దీ ఆలస్యంగా నడుస్తున్నాయి. ప్రసుతం నడుస్తున్న రైళ్లు నిర్ణీత సమయాల్లో నడిపేందుకు రైల్వే శాఖ ఎన్నో చర్యలు తీసుకుంటున్నా ఫలితం లేకుండా పోయింది.
కానీ, తేజస్ విషయంలో మాత్రం మరోలా ఉంది. ఈ రైలు రాకపోకల సమయంలో ఖచ్చితత్వం ఉండాలని ఐఆర్‌సీటీసీ వెల్లడించింది. ఒక వేళ రైలు ఆలస్యంగా వస్తే మాత్రం ప్రయాణికులకు అపరాధం చెల్లించాలని ఐఆర్‌సీటీసీ ఆదేశించింది.
అనుకోని పరిస్థితుల వల్ల ఈ రైలు గంట లేటుగా వస్తే రూ.100, రెండు గంటలు లేటుగా వస్తే రూ.250లు ప్రయాణికులకు చెల్లించనుంది. దీనితో పాటు ప్రయాణికులకు రూ.25 లక్షల ఫ్రీ ఇన్సూరెన్స్ ఇవ్వనుంది. సరిపడా పత్రాలు చూపిస్తే రెండు మూడు రోజుల్లోనే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఒక టోల్‌ఫ్రీ నంబరును ఏర్పాటు చేయనుంది.
రైల్లో ప్రయాణిస్తున్నపుడు ఒకవేళ దోపిడీ జరిగితే రూ.లక్ష ఇవ్వనున్నట్లు రైల్వే అనుబంధ సంస్థ ఐఆర్‌సీటీసీ ప్రకటించింది. రైల్లో ఉచిత టీ, కాఫీలు వెండింగ్ మెషీన్ ద్వారా ఇవ్వనుండగా, ఆర్వో మెషీన్ ద్వారా మినరల్ వాటర్ కూడా అందించనున్నారు. ఈ రైల్లో లక్నో నుంచి ఢిల్లీకి చార్జీలు ఏసీ చైర్ కార్‌కు రూ.1,125, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌కు రూ.2,310గా ఉంది.
ఢిల్లీ నుంచి లక్నోకు ఏసీ చైర్ కార్ రూ.1280 కాగా, ఎగ్జిక్యూటివ్ చైర్ కార్‌లో రూ.2,450గా ఉండనుంది. ఈ రైలు చార్జీలు డిమాండ్‌కు అనుగుణంగా (డైనమిక్ ఫేర్) పెరుగుతాయి. విమానాల్లోలాగే, రైల్లో కూడా ప్రయాణికులకు ఆహారాన్ని అందించనున్నారు. ఈ తరహా విధానాలు ఇప్పటికే పలు దేశాల్లో అమలవుతున్నాయి.