మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By
Last Updated : సోమవారం, 26 ఆగస్టు 2019 (20:11 IST)

రైళ్ళలో టికెట్‌లేని ప్రయాణం విలువ రూ.1377కోట్లు

రైళ్ళలో సరైన టిక్కెట్ లేని ప్రయాణం నేరం.. అందుకు భారీ మూల్యం తప్పదు అంటూ ప్రకటనలు చూస్తుంటాం. కానీ, చాలా మంది ప్రయాణికులు ప్రయాణ టిక్కెట్ లేకుండా ప్రయాణం చేస్తున్నారు. ఇలాంటి వారి నుంచి అపరాధం రూపంలో ఏకంగా రూ.1377 కోట్ల మేరకు వసూలు చేశారు. గత మూడేళ్లలో ఈ మొత్తాన్ని రైల్వే శాఖ వసూలు చేసింది. 
 
రైల్వేల్లో జరిమానాలపై మధ్యప్రదేశ్‌కు చెందిన ఓ సమాచార హక్కు చట్టం కార్యకర్త రైల్వే బోర్డుకు దరఖాస్తు చేశారు. 2016-17 సంవత్సరంలో టికెట్‌ లేకుండా ప్రయాణించి వారి నుంచి రూ.405.30కోట్ల జరిమానాలు వసూలు చేయగా.. 2017-18లో రూ.441.62కోట్లు, 2018-19లో రూ.530.06కోట్లు జరిమానాల రూపంలో వసూలు చేశారని రైల్వే బోర్డు తమ సమాధానంలో పేర్కొంది. మొత్తంగా 2016-19 మధ్య రూ. 1,377కోట్ల మేర జరిమానాల రూపంలో వచ్చాయి. 
 
అంతక్రితం మూడేళ్లతో పోలిస్తే ఇది 31 శాతం ఎక్కువ కావడం గమనార్హం. టికెట్‌‌లేని ప్రయాణం చేసేవారి వల్ల భారీగా ఆదాయాన్ని కోల్పోతుండటంతో 2016లో రైల్వే బోర్డు నిబంధనలు కఠినతరం చేసింది. టికెట్‌ లేని వారిని గుర్తించేలా తనిఖీలు విస్తృతం చేయాలని అన్ని జోనల్‌ రైల్వే కేంద్రాలను ఆదేశించింది. దీంతో అంతకుముందుతో పోలిస్తే గత మూడేళ్లలో జరిమానాలు పెరిగాయి. టికెట్‌ లేకుండా ప్రయాణించిన వ్యక్తి పట్టుబడితే టికెట్‌ ధరతో పాటు రూ.250 నుంచి రూ.1000 వరకు వసూలు చేస్తున్నారు. ఈ పెనాల్టీ చెల్లించని పక్షంలో జైలు శిక్ష విధిస్తున్నారు.