ఆదివారం, 26 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By Selvi
Last Updated : శనివారం, 11 ఫిబ్రవరి 2017 (16:41 IST)

నాకు మంచి జరగకపోతే.. ఏం చేయాలో చేద్దాం.. శశి వార్నింగ్.. గవర్నర్ సీరియస్..

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. శనివారం పోయేస్ గార్డెన్ నుంచి ముగ్గురు మంత్రులు, ఎంపీ తంబిదురైతో కలిసి గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు శశికళ. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస

తమిళనాడు రాజకీయాలు క్షణక్షణం ఉత్కంఠగా మారుతున్నాయి. శనివారం పోయేస్ గార్డెన్ నుంచి ముగ్గురు మంత్రులు, ఎంపీ తంబిదురైతో కలిసి గోల్డెన్ బే రిసార్ట్‌కు వెళ్లారు శశికళ. ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని, ఎమ్మెల్యేలంతా ఓపిగ్గా ఉండాలని కోరినట్లు తెలిసింది. రిసార్టులో ఎమ్మెల్యేలతో భేటీ అయిన శశికళ.. అక్కడ నుంచి రాజ్‌భవన్‌కు వెళ్ళేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. 
 
అమ్మ 1.5 కోట్ల మంది పార్టీ సోదరులను, సోదరీమణులను తన చేతిలో పెట్టి వెళ్లిందని.. వాళ్లంతా తన పక్షాన ఉన్నంతవరకు తనను ఎవరూ ఏమీ చేయలేరని పన్నీర్ సెల్వంని ఉద్దేశించి పరోక్షంగా వ్యాఖ్యానించారు. 'అమ్మ ఎవర్ని నమ్మి పార్టీని చేతిలో పెట్టిందో వారే పార్టీని చీల్చేందుకు కృషి చేస్తున్నారు' అంటూ ఆరోపించారు. పన్నీర్ సెల్వం రాజీనామా చేసి ఏడు రోజులు గడిచిపోయిన నేపథ్యంలో.. గవర్నర్ అపాయింట్‌మెంట్ కోసం శశికళ చేసిన ప్రయత్నాలు సఫలమయ్యాయి. గవర్నర్ కూడా అపాయింట్‌మెంట్ ఇచ్చారని.. గోల్డెన్ బే రెసార్ట్ నుంచి చిన్నమ్మ నేరుగా గవర్నర్‌ను కలుస్తారని తెలుస్తోంది.
 
ఇదిలా ఉంటే.. రిసార్టులో ఎమ్మెల్యేలతో మాట్లాడిన శశికళ హెచ్చరికలు చేశారా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. ఒక వేళ తనకు మంచి జరగకుంటే ఏం చేయాలో తనకు తెలుసు అని శశికళ ఎమ్మెల్యేలతో అన్నట్లు సమాచారం. అంతేగాక, తమ సహనాన్ని పరీక్షించొద్దని ఆమె వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
 
కాగా, ఈ వ్యాఖ్యలను గవర్నర్ విద్యాసాగర్ సీరియస్‌గా తీసుకున్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో చెన్నైలోని లాడ్జీలు, రిసార్టుల్లో ఉన్న వారి వివరాలు సేకరించాలని ఆదేశించారు. దీంతో చెన్నై కమిషనర్ నగరంలోని అన్ని లాడ్జీలు, రిసార్టులు, హోటళ్లలో తనిఖీ చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
 
కాగా, ఇప్పటికే చెన్నైలో అల్లరి మూకలు చేరినట్లు సమాచారం. గవర్నర్ ప్రకటన వెలువడగానే నగరంలో అలజడి సృష్టించేందుకు వారు సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు.