సోమవారం, 18 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : బుధవారం, 24 ఆగస్టు 2016 (12:13 IST)

శశికళ వర్గీయులను పెళ్లికి పిలిచాడనీ... పార్టీ నేత పదవిని ఊడపీకిన జయలలిత

ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై తిరుగుబాటు చేసిన మహిళా నేత శశికళ పుష్ప. రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నందుకుగాను ఆమెపై జయలలిత ఆగ్రహం వ్యక్తంచేస్తూ..

ఇటీవల అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై తిరుగుబాటు చేసిన మహిళా నేత శశికళ పుష్ప. రాజ్యసభ సభ్యురాలిగా కొనసాగుతున్నారు. డీఎంకే ఎంపీ తిరుచ్చి శివపై చేయి చేసుకున్నందుకుగాను ఆమెపై జయలలిత ఆగ్రహం వ్యక్తంచేస్తూ... పార్టీ నుంచి బహిష్కరించారు. ఆ తర్వాత జయలలితపై అనేక ఆరోపణలు చేస్తూ తిరుగుబాటు బావుటాఎగురవేశారు. ఇది జయలలితకు ఏమాత్రం రుచించలేదు. అంతే.. శశికళతో సంబంధం ఉన్నవారందరినీ ఓ కంట కనిపెట్టారు. అంతేనా శశికళతో పాటు.. ఆమెతో సంబంధం ఉన్నవారితో తమ పార్టీకి చెందిన నేతలు ఎవరైనా సన్నిహితంగా మెలుగుతున్నారా అనే విషయాన్ని నిశితంగా గమనిస్తూ వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో తిరునల్వేలి జిల్లాలో బలమైన నేత నారాయణ, ఏఐఏడీఎంకే నిర్వాహక కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఆయన తన కొడుకుకు ఇటీవలే పెళ్ళి చేశారు. చాలా ఆర్భాటంగా ఈ వివాహం చేయగా గొప్ప గొప్పవాళ్ళంతా వచ్చి వధూవరులను దీవించారు. అలా వచ్చినవారిలో పారిశ్రామికవేత్త వైకుంఠ రాజన్ కూడా ఉన్నారు. ఈయన శశికళ పుష్పకు అత్యంత సన్నిహితుడు. 
 
వైకుంఠ రాజన్‌ను పెళ్ళికి పిలిచినందుకు నారాయణపై జయలలిత కోపంతో రగిలిపోయారు. వెంటనే ఆయన నిర్వహిస్తున్న నిర్వాహక కార్యదర్శి పదవిని తొలగించారు. అయితే పార్టీ సభ్యత్వం నుంచి మాత్రం తొలగించకుండా కరుణించారు. మరో విశేషం ఏమిటంటే వైకుంఠ రాజన్ ఈ పెళ్ళికి వస్తున్నారని సమాచారం అందడంతో ఏఐఏడీఎంకే వర్గాలు దూరంగా ఉండటం గమనార్హం.