సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 17 మే 2020 (09:09 IST)

కరోనా చికిత్సకు కుష్టువ్యాధి ఔషధం.. కోలుకుంటున్న రోగులు

భోపాల్‌కు చెందిన ఎయిమ్స్ వైద్యులు కరోనా వైరస్‌కు విరుగుడు మందు కనిపెట్టినట్టు చెప్పారు. తాము జరిపిన ప్రయోగాల్లో ఈ ఔషధం బాగా పని చేస్తుందని వెల్లడించారు. ఆ మందుకూడా కుష్టు వ్యాధి నివారణకు ఉపయోగించే మైకోబ్యాక్టీరం డబ్ల్యూ అని తెలిపారు. ఈ మందుతో కరోనా వైరస్ పేషంట్లపై తాము జరిపిన ప్రయోగాల్లో సానుకూల ఫలితాలు వచ్చినట్టు పేర్కొంది.
 
నిజానికి ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. ముఖ్యంగా, ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయి. కరోనా టీకాను అభివృద్ధి చేసేందుకు శాస్త్రవేత్తలు రేయింబవళ్లు శ్రమిస్తున్నారు. ఇప్పటికే కొన్ని వ్యాక్సిన్లు క్లినికల్ ట్రయల్స్‌లో ఉన్నాయి. 
 
ఈ పరిస్థితుల్లో భోపాల్‌లోని ఎయిమ్స్ వైద్యులు నిర్వహించిన ఔషధ ప్రయోగాల్లో కుష్టువ్యాధి రోగులకు ఇచ్చే ఔషధాన్ని ఇచ్చి సానుకూల ఫలితాలు రాబట్టారు. మైకోబ్యాక్టీరియం డబ్ల్యూ అనే ఈ ఔషధాన్ని నలుగురు కరోనా రోగులకు ఇవ్వగా వీరిలో ముగ్గురు కోలుకున్నట్టు ఎయిమ్స్ డైరెక్టర్ శర్మాన్ సింగ్ తెలిపారు. 
 
మైకోబ్యాక్టీరియం డబ్ల్యూ ఔషధం కరోనా రోగులపై పనిచేస్తుందా? లేదా? అన్న విషయాన్ని నిర్ధారించేందుకు భోపాల్‌లోని ఎయిమ్స్‌తోపాటు మూడు ఆసుపత్రులలో ప్రయోగాలు నిర్వహించేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ మండలి అనుమతి ఇచ్చింది. ఈ ఔషధం సానుకూల ఫలితాలు ఇవ్వడంతో ఫావిపిరావిర్ అనే ఔషధాన్ని కూడా కోవిడ్ రోగులకు ప్రయోగాత్మకంగా ఇచ్చి చూస్తామని శర్మాన్ సింగ్ తెలిపారు.