సేఫ్టీ వాల్‌ను ఢీకొట్టిన విమానం... ప్రయాణికులు పరిస్థితి?
తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి విమానాశ్రయంలో పెను ప్రమాదం తప్పింది. ఈ ఎయిర్‌పోర్టు నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా సేఫ్టీ వాల్ (ప్రహరీగోడ)ను విమానం ఢీకొట్టింది. ఆ సమయంలో విమానంలో 130 మంది ప్రయాణికులు ఉండగా, వీరిలో ఏ ఒక్కరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. దీంతో ఎయిర్‌పోర్టు అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన గురువారం రాత్రి 1.30 గంటల సమయంలో జరిగింది.
తిరుచ్చి నుంచి దుబాయ్‌కు ఎయిరిండియా విమానం ఒకటి గురువారం రాత్రి 1.30 గంటల సమయంలో బయలుదేరింది. ఈ విమానం టేకాఫ్ అవుతుండగా రెండు చక్రాలు ఏటీసీ ప్రహరీగోడను ఢీకొట్టుకుంటూ వెళ్లిందని, ప్రమాదాన్ని గుర్తించిన పైలట్లు విమానాన్ని ముంబైకి దారి మళ్లించారని అధికారులు తెలిపారు. ముంబై విమానాశ్రయంలో ఉదయం 5.39 గంటలకు విమానం ల్యాండ్ కావడంతో ప్రయాణికులంతా ఊపిరి పీల్చుకున్నారు.
విమానంలో ఆరుగు సిబ్బంది, 130 మంది ప్రయాణికులతో కలిపి మొత్తం 136 మంది ప్రయాణిస్తుండగా ఘటన చోటుచేసుకుంది. విమానం గోడను ఢీకొట్టిన తర్వాత కొంతసేపు ఎటీఎస్ సిగ్నల్‌తో సంబంధాలు తెగిపోయినట్టు కూడా అధికారులు చెప్పారు. అయితే ఆ తర్వాత కొన్ని గంటలకు విమానం ముంబైలో ల్యాండైనట్టు చెప్పారు. ముంబై నుంచి మరో విమానంలో ప్రయాణికులను దుబాయ్‌కు పంపారు. ఈ ప్రమాదంపై కేంద్ర మంత్రి సురేష్ ప్రభు విచారణకు ఆదేశించారు.