బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 13 అక్టోబరు 2020 (10:26 IST)

ధనవంతుల బిడ్డ అయితే, ఇలానే చేస్తారా? ఖాకీలకు హైకోర్టు సూటి ప్రశ్న!!

హత్రాస్ హత్యాచార బాధితురాలి కేసును అలహాబాద్ హైకోర్టు అక్టోబరు ఒకటో తేదీన సుమోటాగా స్వీకరించి విచారణ చేపడుతోంది. ఈ కేసులో పోలీసుల వైఖరిని హైకోర్టు లక్నో బెంచ్ తీవ్రంగా తప్పుబట్టింది. అర్థరాత్రి 2 గంటల సమయంలో అంత్యక్రియలేంటి అంటూ నిలదీసింది. ధనవంతుల బిడ్డ అయితే ఇలాగే చేస్తారా అంటూ ప్రశ్నించింది. బాధితురాలి తల్లిదండ్రులు, బంధు మిత్రుల ఆకాంక్షలను కనీసం పరిగణనలోకి తీసుకోలేదని, ఈ కేసును తాము తీవ్రంగా పరిగణిస్తున్నట్టు హైకోర్టు న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. 
 
హత్రాస్ కేసును సుమోటాగా స్వీకరించిన హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. బాధితురాలి తల్లిదండ్రులను తమ ఎదుట ప్రవేశపెట్టాలని ఆదేశించింది. దీంతో జిల్లా మేజిస్ట్రేట్ పర్యవేక్షణలో కట్టుదిట్టమైన భద్రత నడుమ హత్రాస్ మృతురాలి తల్లిదండ్రులను హైకోర్టుకు తరలించారు. వారి సమక్షంలోనే ఈ కేసులో వాదనలు జరిగాయి. 
 
ఈ సదర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్థిక, కులాల ప్రస్తావన తీసుకుని వచ్చి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ కేసులో బాధితురాలి అంత్యక్రియలను జరిపించిన తీరును తీవ్రంగా తప్పుబడుతూ, అర్థరాత్రి 2 గంటల సమయంలో హడావుడిగా మృతదేహాన్ని దహనం చేయడాన్ని ప్రశ్నించింది. బాధితురాలు ధనవంతుల బిడ్డ అయితే, ఇలాగే చేస్తారా? అని పోలీసులను నిలదీసింది. 
 
అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్, ఈ కేసు విచారణను చేపట్టి, పోలీసుల తీరును దుయ్యబట్టగా, స్థానిక పరిస్థితులు, స్థానికంగా శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఇలా చేయాల్సి వచ్చిందంటూ అధికారులు కోర్టుకు వెల్లడించారు. ఆ బాలిక పేద కుటుంబానికి చెందకుండా, డబ్బున్న వారి ఇంటి అమ్మాయే అయితే, పోలీసులు ఈ కేసును మరో కోణంలో తీసుకుని ఉండేవారని ఈ సందర్భంగా న్యాయమూర్తి వ్యాఖ్యానించారు.
 
ఈ కేసును కోర్టు కూడా తీవ్రంగా పరిగణిస్తోందని బాధితురాలి కుటుంబం తరపున వాదనలు వినిపిస్తున్న న్యాయవాది సీమా కుశాహ్వా వెల్లడించారు. ఈ కేసులో జిల్లా మెజిస్ట్రేట్ ప్రవీణ్ కుమార్ సహా పలువురు అధికారులకు కోర్టు ఇప్పటికే సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. అర్థరాత్రి పూట దహన సంస్కారాలకు ఆయన కూడా కారణమేనన్న అభియోగాలు నమోదయ్యాయి.
 
ఈ కేసు విషయంలో పోలీసులు కనీస మానవ హక్కులను, మృతురాలి బంధుమిత్రుల ఆకాంక్షలను పరిగణనలోకి తీసుకోలేదని, మృతురాలి ఇంట్లో బంధువులు ఉండగా, తాళం వేసి మరీ అంత్యక్రియలు ఎందుకు ముగించారని ప్రశ్నించింది. కడసారి చూపులకు కూడా వారిని దూరంచేయడం మానవత్వం అనిపించుకోదని వ్యాఖ్యానించింది.