మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : ఆదివారం, 11 అక్టోబరు 2020 (17:06 IST)

ఆ కులాల వారిని కనీసం మనషులుగా చూడటం లేదు : రాహుల్ ఆవేదన

దేశంలో కేంద్రంతోపాటు వివిధ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న బీజేపీ పాలకులు దళితులు, ముస్లింలు, గిరిజనులను కనీసం మనుషులుగా కూడా చూడటం లేదని కాంగ్రెస్ పూర్వ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా దేశంలో సంచలనం రేపిన హత్రాస్ హత్యాచార బాధితురాలి మృతిపట్ల ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బీజేపీ పాలకులు అనుసరిస్తున్న వైఖరిని ఆయన మరోమారు ఎండగట్టారు. 
 
ఇదే అంశంపై ఆయన ఆదివారం ఓ ట్వీట్ చేశారు. యూపీలో అరాచ‌క పాల‌న న‌డుస్తున్న‌ద‌ని ఆయ‌న విమ‌ర్శించారు. దేశంలో ద‌ళితులు, ముస్లింలు, గిరిజ‌నుల‌ను క‌నీసం మ‌నుషులుగా కూడా చూడ‌టంలేద‌ని, ఇది సిగ్గుపడాల్సిన నిజ‌మ‌ని రాహుల్‌గాంధీ మండిప‌డ్డారు. ప్ర‌జాస్వామ్య దేశంలో మ‌నిషిని మ‌నిషిగా చూడ‌క‌పోవ‌డం దారుణ‌మ‌న్నారు.
 
ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి, అత‌ని పోలీసులు ఎవ‌రిపైనా అత్యాచారం జ‌రుగ‌లేదు అని చెప్ప‌డం విడ్డూరంగా ఉందంటూ మండిపడ్డారు. అంటే వారి దృష్టిలో, దేశంలోని వారి మ‌ద్ద‌తుదారుల దృష్టిలో హ‌త్రాస్ బాధితురాలు మ‌నిషే కాదా..? అని రాహుల్ ప్ర‌శ్నించారు. క‌నీసం మ‌నిషిని మ‌నిషిగా కూడా గుర్తించ‌క‌పోవ‌డం అన్యాయం అన్నారు. 
 
'బాధితురాలే స్వయంగా తనపై అత్యాచారం జరిగిందని చెబితే, పోలీసులు మాత్రం అత్యాచారం జరగలేదని ఎందుకు చెబుతున్నారు?' అంటూ ఓ అంతర్జాతీయ మీడియా సంస్థలో వచ్చిన కథనాన్ని కూడా రాహుల్ ట్విట్టర్‌లో పంచుకున్నారు. అత్యాచారానికి గురైంది దళిత యువతి కాబట్టి ఆమెను ఎవరూ లెక్కచేయడంలేదని ఆవేదన వెలిబుచ్చారు.