బుధవారం, 27 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 7 అక్టోబరు 2020 (10:51 IST)

హత్రాస్ ఘటన.. 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్.. మొత్తం 104సార్లు..?

దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన హత్రాస్ సామూహిక అత్యాచారం కేసులో మరో కోణం బయటపడింది. ప్రధాన నిందితుడు సందీప్ ఠాకూర్‌తో బాధితురాలు ఫోన్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. విచారణలో భాగంగా ఫోన్ పరిశీలించగా ఇది తేలిందని చెప్పారు.

ఏడాది నుంచి వీరిద్దరూ తరుచూ ఫోన్‌లో మాట్లాడుకుంటున్నట్లు పేర్కొన్నారు. మృతురాలు సోదరుడి పేరుతో ఉన్న సిమ్ నుంచి ఈ సంభాషణలు సాగాయని అన్నారు. దాదాపు 100కు పైగా కాల్స్ ఉన్నాయని గుర్తించారు.
 
ఇరువురి ఫోన్ నంబర్ల మధ్య 62 అవుట్‌ గోయింగ్ కాల్స్, 42 ఇన్‌కమింగ్ కాల్స్ కలిపి మొత్తం 104 సార్లు ఉన్నాయని తెలిపారు. అక్టోబరు 2019 నుంచి మార్చి 2020 మధ్య ఈ సంభాషణలు జరిగాయని అన్నారు.

చందపా ప్రాంతంలో ఉన్న సెల్ టవర్‌ నుంచి ఎక్కువ కాల్స్‌ వెళ్లినట్టుగా పేర్కొన్నారు. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సందీప్‌తో ఆమె ఫోన్ మాట్లాడినట్టు తేలడంతో సంచలనంగా మారింది.
 
అయితే దీనిపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. కేసును తప్పుదోవ పట్టించేందుకే ఇలా చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికే పోస్టుమార్టం రిపోర్టులోనూ అత్యాచారం జరగలేదని తేలిందని ఏడీజీ ప్రశాంత్ కుమార్ ప్రకటించారు. తీవ్రంగా కొట్టడం వల్లే చనిపోయిందని పేర్కొన్న సంగతి తెలిసిందే.