నిర్భయ లాయర్ చేతికే హత్రాస్ కేసు.. శిక్ష ఖాయమన్న సీమా..
2012 డిసెంబర్ 16న ఢిల్లీలో జరిగిన నిర్భయ కేసుతో యావత్ దేశం ఉలిక్కిపడింది. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఈ కేసును వాదించేందుకు లాయర్ సీమా కుష్వాహా ముందుకు వచ్చారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా చివరకు దోషులకు శిక్షపడేలా చేశారు. దీంతో ఆమె పేరు యావత్ దేశానికి తెలిసింది. ప్రస్తుతం హత్రాస్ ఘటనతో మరోసారి సీమా తెరపైకి వచ్చారు. ఈ కేసులోనూ న్యాయం జరిగేలా చేయాలని పలువురు కోరుతున్నారు.
ఎందుకంటే.. నిర్భయ అత్యాచార కేసులో విజయం సాధించి దోషులకు ఉరిశిక్ష పడేలా పోరాటం చేసిన లాయర్ చేతికే హత్రాస్ కేసు కూడా వెళ్లింది.
లాయర్ సీమా కుష్వాహా ఈ కేసును తీసుకుంటానని పేర్కొన్నారు. నిందితులకు కచ్చితంగా శిక్ష పడేలా చూస్తానని వెల్లడించారు. దీని కోసం ఆమె బాధితురాలి కుటుంబాన్ని కలిసేందుకు కూడా వెళ్లారు.
అయితే పోలీసులు అడ్డుకోవడంతో కలవలేకపోయారు. అధికారులు తనకు అంతరాయం కలిగిస్తున్నారని ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా కూడా తాను ఈ కేసును వాదిస్తానని స్పష్టం చేశారు. బాధితురాలి అన్నతో తాను సంప్రదింపులు జరుపుతున్నానని చెప్పారు.