సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులను వేధించడమా? హైకోర్టు ప్రశ్న
సంతోషంగా పెళ్లి చేసుకుని జీవిస్తున్న దంపతులపై కేసు నమోదు చేయడాన్ని అలహాబాద్ హైకోర్టు తప్పుబట్టింది. వివాహం తర్వాత సంతోషంగా జీవిస్తున్న జంటను విచారణ పేరుతో వేధించడం సరికాదని హితవు పలికింది. ఇలాంటి కేసుల్లో విచారణ కొనసాగించడం వేధింపులకు ఒక సాధనంగా మారుతుందని అభిప్రాయపడింది. ఈ మేరకు ఓ యువకుడిపై పోక్సో చట్టం కింద నమోదైన క్రిమినల్ కేసును కొట్టివేస్తూ నవంబరు 21న తీర్పు వెలువరించింది.
అశ్వని ఆనంద్ అనే యువకుడు తన కుమార్తెను కిడ్నాప్ చేశాడంటూ ఓ వ్యక్తి ఏప్రిల్ 2024లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేశారు. అయితే, పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో ఆ యువతి తన తండ్రి ఆరోపణలను ఖండించింది. తాను ఇష్టపూర్వకంగానే ఇంటి నుంచి వచ్చానని, తనను ఎవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసింది. ఆ తర్వాత ఆమె నిందితుడైన అశ్వని ఆనంద్‌ను వివాహం చేసుకుంది.
ఈ నేపథ్యంలో తనపై నమోదైన కేసును కొట్టివేయాలని కోరుతూ అశ్వని ఆనంద్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ పిటిషనుపై విచారణ జరిపిన జస్టిస్ క్షితిజ్ శైలేంద్ర ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. న్యాయం కోసం వచ్చినప్పుడు న్యాయస్థానాలు మూగ ప్రేక్షకులుగా ఉండలేవని పేర్కొంది.
ప్రతి కంటి నుంచి కన్నీటి బొట్టును తుడవడం న్యాయమూర్తి పవిత్ర కర్తవ్యమని తెలిపింది. చట్టం ఉద్దేశం సమస్యలను సృష్టించడం కాదని, పరిష్కారాలను కనుగొనడమని ధర్మాసనం పేర్కొంది. ప్రస్తుతం భార్యాభర్తలుగా సంతోషంగా ఉన్న జంటను కోర్టుల చుట్టూ తిప్పడం సరికాదని, ఇది వారిని వేధించడమే అవుతుందని స్పష్టం చేస్తూ క్రిమినల్ కేసును కొట్టివేసింది.