శుక్రవారం, 24 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 25 ఏప్రియల్ 2020 (08:55 IST)

ఆటో డ్రైవర్ ఆలోచనకు ఆనంద్ మహీంద్రా ఫిదా... ట్వీట్ వైరల్

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే పారిశ్రామికదిగ్గజాల్లో ఆనంద్ మహీంద్రా ఒకరు. ఈయన ఏదో ఒక అంశంపై స్పందిస్తుంటారు. పైగా, ఆయన స్పందించే అంశాల్లో సామాజిక స్పృహ ఉంటుంది. అందుకే ఆయన షేర్ చేసే వీడియోలు లేదా ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. తాజాగా ఆయన చేసిన ట్వీట్ కూడా వైరల్ అయింది. 
 
ప్రపంచాన్ని కబళించిన కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు ఎలాంటి మందులు లేవని వైద్య నిపుణులు తేల్చి చెప్పారు. కేవలం వ్యక్తిగత పరిశుభ్రత, సామాజిక, భౌతిక దూరాలు పాటించడమే మానవాళి ముందున్న ఏకైకా మార్గం అని వైద్య నిపుణులు ఘోషిస్తున్నారు. 
 
అయితే, ఇదే సందర్భంలో ఈ-ఆటోరిక్షాను అరలుగా మార్చి ప్రయాణికులకు సామాజిక దూరం వెలుసుబాటు కల్పించిన.. ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది.. అదికాస్త మహీంద్రా గ్రూప్‌ చైర్మన్‌ ఆనంద్‌ మహింద్రా కంట్లో పడింది. 
 
ఆటోరిక్షాను ఐదు భాగాలుగా విభజించిన సదరు డ్రైవర్‌ వినూత్న ఆలోచనపై ప్రశంసలు కురిపంచిన మహీంద్రా.. క్లిష్ట పరిస్థితుల్లో వేగవంతమైన, వినూత్న ఆలోచనలు చేయగల సామర్థ్యం మన సొంతం.. నూతన పరిస్థితులకు అనుగుణంగా విభిన్న ఆలోచనలు నన్ను ఆశ్చర్యపరుస్తున్నాయి.. అని కామెంట్‌ చేసి ఆ వీడియోను షేర్ చేశారు. 
 
అంతేకాకుండా, ఆ ఆటో డ్రైవర్‌కు కూడా ఓ బంపర్ ఆఫర్ ఇచ్చారు. మహీంద్రా అండ్ మహీంద్రా ఆటో, ఫార్మ్‌ సెక్టార్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జెజురికర్‌ను తన ట్వీట్‌ను ట్యాగ్‌ చేస్తూ.. తమ ఆటో బిల్డింగ్‌ కంపెనీలో ఈ-ఆటోరిక్షా డ్రైవర్‌ను సలహాదారుగా పెట్టుకుందామని పేర్కొన్నారు. 
 
ఇక, మహింద్రా ట్వీట్ కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది.. ఆయన స్పందనపై ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు.. 17 గంటల్లోనే 6.1 వేల రీట్వీట్లు, 28.4 వేల లైక్‌లు.. 651 కామెంట్లు వచ్చాయి.