బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 22 సెప్టెంబరు 2020 (11:36 IST)

చాయ్ తీసుకెళ్లినా శాంతించని సభ్యులు : హరివంశ్ నిరాహారదీక్ష

రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెట్టిన వేళ, పోడియంలోకి దూసుకెళ్లి, నిరసన తెలియజేసి సస్పెన్షన్‌కి గురైన ఎనిమిది మంది ఎంపీలు, రాత్రంతా పార్లమెంట్ ఎదుట ఉన్న పచ్చిక బయళ్లలోనే కూర్చుని తమ నిరసనను కొనసాగించారు. సోమవారం రాజ్యసభ ఐదుసార్లు వాయిదా వేసినప్పటికీ, వారు హౌస్‌ను వీడేందుకు నిరాకరించిన సంగతి తెలిసిందే. తాము రైతుల పట్ల పోరాడుతూ ఉన్నామని, పార్లమెంట్‌ను చంపేశారని రాసున్న ప్లకార్డులను వారు ప్రదర్శించారు.
 
ఇదిలావుంటే, మంగళవారం ఉదయం రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్, రాజ్యసభకు వచ్చిన వేళ ఆసక్తికర ఘటన జరిగింది. నేరుగా నిరసన చేస్తున్న ఎంపీల వద్దకు వెళ్లిన ఆయన, వారిని పరామర్శించి, టీ తాగాలని కోరారు. అయితే, ఎంపీలు మాత్రం హరివంశ్ ఇచ్చిన చాయ్ తాగేందుకు నిరాకరిస్తూ, ఆయన్ను రైతు వ్యతిరేకిగా అభివర్ణించారు. కాగా, సోమవారం విపక్ష సభ్యులు హరివంశ్‌పై ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని ఛైర్మన్ వెంకయ్యనాయుడు తిరస్కరించిన సంగతి తెలిసిందే.
 
మరోవైపు, వ్యవసాయ బిల్లులపై జరిగిన చర్చలో విపక్ష ఎంపీలు సభలో అనుచితంగా ప్రవర్తించారని రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్‌ ఆరోపించారు. ఎంపీల ప్రవర్తనకు నిరసనగా తాను మంగళవారం ఉదయం నుంచి 24 గంటలు నిరాహార దీక్షకు దిగినట్లు పేర్కొన్నారు. ఇదేవిషయంపై ఆయన  రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడుకు లేఖ రాశారు. 
 
'రెండు రోజులుగా రాజ్యసభలో జరిగిన పరిణామాలు నన్ను మానసిక వేదనకు గురిచేశాయి. ఆవేదనలో రాత్రి నిద్ర కూడా పట్టలేదు. ప్రజాస్వామ్యం పేరిట గౌరవ సభ్యులు హింసాత్మకంగా వ్యవహరించారు. కొందరు రూల్‌ బుక్‌ను చింపి నాపై విసిరారు. మరికొందరు టేబుళ్లపై నిలబడి అసభ్య పదజాలం ఉపయోగించారు. జరిగిన పరిణామాలను గుర్తు చేసుకుంటే నిద్రకూడా పట్టడం లేదు' అని ఆయన పేర్కొన్నారు.
 
పైగా, తన నిరాహార దీక్షతో సభ్యులు కొంతైనా పశ్చాతాపం చెందుతారని ఆశిస్తున్నానని అన్నారు. తాను జయప్రకాశ్‌ నారాయణ్‌ గ్రామానికి చెందిన వాడినని, ఆయన నుంచి తాను చాలా నేర్చుకున్నారని తన రాజకీయ ప్రస్థానం సైతం బీహార్‌ నుంచే ప్రారంభమైందని తెలిపారు. వైశాలి ప్రజలకు ప్రజాస్వామ్యం విలువ తెలుసని అన్నారు.