శనివారం, 4 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 21 ఆగస్టు 2021 (13:24 IST)

భూమికి చేరువగా గ్రహశకలం.. 4,500 అడుగుల వెడల్పుతో వచ్చేస్తోంది..

గ్రహశకలాలు ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలకు ఆందోళన కలిగిస్తూనే ఉంటాయి. 4,500 అడుగుల వెడల్పు కలిగిన ఒక గ్రహశకలం శనివారం భూమికి చేరువుగా రానున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ 'నాసా' తెలిపింది. సుమారు 4.6 బిలియన్‌ సంవత్సరాల క్రితం సౌరవ్యవస్థ ఏర్పడిన తర్వాత అంతరిక్షంలో మిగిలి ఉన్న రాతి శకలాలను గ్రహ శకలాలుగా పేర్కొంటారని నాసా వెల్లడించింది. 
 
గంటకు 94,208 కిలోమీటర్ల వేగంతో నేడు భూమికి దగ్గరగా దూసుకొస్తుందని తెలిపింది. ఈ గ్రహశకలానికి '2016 ఏజే193' అని శాస్త్రవేత్తలు పేరు పెట్టినట్లు వివరించింది. దీన్ని అత్యంత ప్రమాదకరమైన అంతరిక్ష శిలగా పేర్కొంది.
 
అయితే ఈ ఆస్ట్రాయిడ్‌ కారణంగా ఎలాంటి హాని ఉండదని తెలిపింది. తన కక్ష్యలో పరిభ్రమిస్తూ ఇది శనివారం భూమికి దగ్గరగా వచ్చి వెళుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఆ సమయంలో గ్రహ శకలానికి, భూమికి మధ్య ఉన్న దూరం.. భూమికి, చంద్రుడికి మధ్య ఉన్న దూరంతో పోలిస్తే 9 రెట్లు ఎక్కువని అన్నారు.
 
ఇది మళ్లీ 2063లో భూమికి దగ్గరగా వస్తుందన్నారు. 2016 జనవరిలో హవారులోని పాన్‌-స్టార్స్‌ అబ్జర్వేటరీ సాయంతో ఈ గ్రహశకలాన్ని గుర్తించారు. ఆ తర్వాత నాసా.. నియోవైస్‌ అనే వ్యోమనౌక సాయంతో దీన్ని నిశితంగా పరిశీలించింది. 
 
ఇది 5.9 ఏళ్లకోసారి సూర్యుడిని చుట్టి వస్తుందని తెలిపారు. ఆగస్ట్‌ 21న భూమికి దగ్గరగా వచ్చిన ఈ గ్రహ శకలం 65 ఏళ్ల అనంతరం భూమికి దగ్గరగా వస్తుందని అన్నారు. ఈ ఖగోళ వస్తువు చాలా చీకటిగా ఉందని, దీని నుంచి ఎక్కువ కాంతి పరావర్తనం చెందడంలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.