సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By వరుణ్

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలో తొలిసౌర నగరంగా అయోధ్య

ayodhya city
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రామాలయ నిర్మాణాన్ని చేపట్టింది. ఇది త్వరలోనే పూర్తికానుంది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరాన్ని సౌరనగరంగా యూపీ ప్రభుత్వం తీర్చిదిద్దనుంది. యూపీ రాష్ట్ర కొత్త పునరుత్పాదక ఇంధన శాఖ ఈ పనులను చేపట్టనుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే రాష్ట్రంలో తొలి సౌర నగరంగా అయోధ్య అవతరించనుంది. 
 
ఇందుకోసం ఆ శాఖ అధికారులు యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నారు. జనవరి 22వ తేదీన జరిగే అవకాశమున్న రామాలయ ప్రాణప్రతిష్ఠ వేడుకకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది ప్రతినిధులు హాజరుకానున్నట్లు ఆలయ కమిటీ అధ్యక్షుడు నృపేంద్ర మిశ్ర ఇప్పటికే ప్రకటించారు. 
 
అదేసమయంలో అయోధ్య నగరాన్ని సౌర కాంతులతో నింపే పనులను ఇటీవల పర్యవేక్షించిన రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ 'సూర్యవంశానికి రాజధాని అయోధ్య. కాబట్టి, ఇక్కడ ఇతర మార్గాల ద్వారా కాకుండా ఆ సూర్యుడి ద్వారానే విద్యుత్తు ప్రసరిస్తుంది' అని ప్రకటించారు. 
 
ఈ ప్రణాళికలో భాగంగా సరయూ నది ఒడ్డున 40 మెగావాట్ల సోలార్‌ ప్లాంటు ఏర్పాటు చేస్తున్నారు. వీధి దీపాలు మొదలు సౌరశక్తితో నడిచే పడవలు, ప్రజా రవాణా, మొబైల్‌ చార్జింగ్‌ కేంద్రాలు, ప్రభుత్వ భవనాల విద్యుదీకరణ.. ఇలా సర్వం సోలార్‌ పవర్‌ ఆధారంగానే నడవనున్నాయి. అందుకు తగిన విధంగా  ఏర్పాట్లు చేస్తున్నారు.